రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్న ఆహార, ఔషధ కల్తీలను అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోంది. మార్కెట్‌లో కూరగాయలు, పండ్లు, పాలు వంటి నిత్యావసర వస్తువులు విచ్చలవిడిగా కల్తీ బారిన పడుతున్న పరిస్థితిపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రతిపాదిత ‘తెలంగాణ ఆహార కల్తీ, ఔషధ నియంత్రణ చట్టం’ (TGFADCA) పై శనివారం MCHRDలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు, పండ్లను త్వరగా మగ్గబెట్టేందుకు విచ్చలవిడిగా రసాయనాలు వాడటం వల్ల ప్రజలు క్యాన్సర్‌ల వంటి భయంకర రోగాల బారిన పడుతున్నారని ఈ సమావేశంలో ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

రసాయనాలు, ఎరువుల అతిగా వాడకం కారణంగా పంట ఉత్పత్తుల్లో ప్రమాదకర అవశేషాలు బయటపడుతున్నాయని, ఈ నేపథ్యంలో మన ఉత్పత్తులను దిగుమతి చేసుకోవడానికి విదేశాలు కూడా నిరాకరిస్తున్నాయని సీఎం సమావేశంలో ప్రస్తావించారు. మార్కెట్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల పేరుతో అధిక ధరలకు అమ్ముతున్నప్పటికీ, అవి నిజంగా ఆర్గానిక్‌వేనా అనే విషయాన్ని నిర్ధారించే సరైన వ్యవస్థలు ప్రస్తుతం లేవని ఆయన పేర్కొన్నారు.

కల్తీల నిరోధానికి ప్రపంచంలోనే అత్యుత్తమ చట్టాలు అమలులో ఉన్న దేశాల విధానాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆ నివేదికల ఆధారంగా బలమైన బిల్లును తయారు చేసి, ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించడంతో పాటు శాసనసభలో దీనిపై సమగ్రమైన చర్చ చేపట్టేలా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

కల్తీ రాయుళ్ల గుట్టురట్టు చేసేందుకు సమాచార సేకరణను వ్యవస్థీకృతం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో ‘విజిల్ బ్లోయర్లు’ను నియమించాలని ముఖ్యమంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు. కల్తీ నిరోధక నిబంధనలను కఠినంగా అమలు చేసే క్రమంలో తొలి విడతగా ‘CURE’ ప్రాంతాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

ఆ ప్రాంతంలో కొత్త నిబంధనలను అమలు చేసి, అందులో ఎదురయ్యే లోటుపాట్లను గుర్తించి సరిదిద్దుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా చట్టాన్ని విస్తరించేలా కార్యాచరణ రూపకల్పన చేయాలని సూచించారు. కల్తీ ఆహార తయారీదారులపై క్రిమినల్ కేసుల దిశగా చర్యలు తీసుకోవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు.

ఈ కీలక సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, డీజీపీ సి.వి. ఆనంద్, సీఎం సలహాదారు కె. రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీలు వి. శేషాద్రి, ఎన్. శ్రీధర్‌తో పాటు పలు శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.