రాయలసీమ న్యూస్, తెలంగాణ డెస్క్:
తెలంగాణలో భిన్న వాతావరణం:
హైదరాబాద్‌లో వర్షాలకు ఉపశమనం, రాష్ట్రానికి ఎల్లో అలర్ట్
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం విభిన్న రూపం సంతరించుకుంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండగా, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు కురిసి కొంత ఉపశమనం కలిగిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు దక్షిణ జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది.
వికారాబాద్, హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, యాదాద్రి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి. వీటిలో వికారాబాద్ జిల్లాలోని తాండూరులో, వనపర్తి జిల్లా ఏదులలో చెరో 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా మాడ్గుల్లో 4.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది.
మరో వారం రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల ప్రభావంతో హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల కంటే తక్కువగానే నమోదయ్యాయి. అయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఎండ తీవ్రత తగ్గలేదు. కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూరులో గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డైంది. జగిత్యాల జిల్లా నేరెళ్ల, మంచిర్యాల జిల్లా ర్యాలీలో 43 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.
జయశంకర్, ఖమ్మం, వరంగల్, పెద్దపల్లి, సూర్యాపేట, ఆదిలాబాద్, హనుమకొండ, నల్గొండ, నిర్మల్, భద్రాద్రి, మహబూబాబాద్, ములుగు, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ జిల్లాల్లో 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇక నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే విస్తరించాయి. వచ్చే రెండు రోజుల్లో ఇవి తెలంగాణలోకి కూడా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అంతకుముందు వరకు ఎండ తీవ్రంగా ఉండగా, ఆ తరువాత మేఘాలు కమ్ముకుని జోరుగా వర్షం కురిసింది. ఎండ వేడిమితో ఇబ్బందులు పడుతున్న నగరవాసులకు చల్లని గాలి, వర్షం కొంత ఉపశమనం కలిగించింది.
దాదాపు అరగంటపాటు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షం నమోదైంది. షేక్ పేట, గచ్చిబౌలి, కూకట్ పల్లి, గోల్కొండ, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. గచ్చిబౌలి, షేక్ పేట ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండటంతో కొన్నిచోట్ల ట్రాఫిక్ మందగించింది.







