రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్:
టిమ్స్ కోసం 180 మంది డాక్టర్ల డిప్యుటేషన్ – ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌లో సేవలకు భంగం ఆందోళన
సనత్‌నగర్‌లో త్వరలో ప్రారంభంకానున్న తెలంగాణ ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఆసుపత్రి కోసం ప్రభుత్వం భారీ స్థాయిలో వైద్యులను డిప్యుటేషన్‌పై బదిలీ చేయడంతో, రాష్ట్రంలోని ప్రధాన బోధనా ఆసుపత్రుల్లో వైద్యుల కొరత తీవ్రంగా పెరిగే పరిస్థితి ఏర్పడింది. డైరెక్టర్ అఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉస్మానియా, గాంధీ, NIMS వంటి ప్రముఖ బోధనా ఆసుపత్రుల నుంచి కొత్త నియామకాలు చేయకుండా నేరుగా వైద్యులను టిమ్స్‌కు తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో మొత్తం 180 మంది డాక్టర్లను డిప్యుటేషన్‌పై టిమ్స్‌కు బదిలీ చేస్తూ డీఎంఈ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో 98 మంది ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 82 మంది సీనియర్ రెసిడెంట్లు ఉన్నారు.
డీఎంఈ ఉత్తర్వుల ప్రకారం, డిప్యుటేషన్‌కు ఎంపికైన వైద్యులందరినీ జూన్ 18నాటికి తమ తమ ఆసుపత్రుల నుంచి రిలీవ్ చేసి, జూన్ 19వ తేదీ ఉదయం కల్లా టిమ్స్‌లో విధుల్లో చేరేలా ఆదేశాలు జారీ చేశారు. దీంతో చాలా తక్కువ సమయంలోనే కీలక విభాగాల్లో పనిచేస్తున్న నిపుణులు బదిలీ కావాల్సి వస్తోంది.
ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, NIMS ఆసుపత్రుల్లోనే వైద్యుల కొరత ఉన్న నేపథ్యంలో, అక్కడి నుంచి పెద్ద సంఖ్యలో నిపుణులను తరలించడం పట్ల వైద్యవర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సేవలు దెబ్బతినే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
న్యూరాలజీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆంకాలజీ వంటి కీలక విభాగాల్లో ఇప్పటికే పని భారం ఎక్కువగా ఉండగా, అక్కడి నుంచి ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సీనియర్ రెసిడెంట్లు బదిలీ అయితే, అత్యవసర సేవలు, శస్త్రచికిత్సలు, బోధన కార్యక్రమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని వైద్య వర్గాలు సూచిస్తున్నాయి.
ఇప్పటికే ఉస్మానియా, గాంధీ, NIMS ఆసుపత్రుల్లో సేవలపై ప్రభావం కనిపించడం ప్రారంభమైందని, షెడ్యూల్ చేసిన కొన్ని శస్త్రచికిత్సలు వాయిదా పడే పరిస్థితి వస్తోందని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. టిమ్స్ ప్రారంభం అవసరమేనని అంగీకరిస్తూనే, దానికి అవసరమైన సిబ్బందిని కొత్త నియామకాల ద్వారా భర్తీ చేయకుండా, ఇప్పటికే భారంతో నడుస్తున్న బోధనా ఆసుపత్రుల నుంచి నిపుణులను తరలించడం సరైన నిర్ణయం కాదని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
టిమ్స్‌ను త్వరగా ప్రారంభించాలనే ప్రభుత్వ ఆతృత, మరోవైపు బోధనా ఆసుపత్రుల్లో సేవల నాణ్యత మధ్య సమతుల్యం ఎలా సాధిస్తారన్న దానిపై వైద్య వర్గాలు, రోగులు, ప్రజా సంఘాలు దృష్టి సారిస్తున్నాయి.







