వీడియోకాల్‌లో వీడ్కోలు చెప్పి దంపతుల ఆత్మహత్య

హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌ రైల్వే పరిధిలో దంపతులు రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లా కుంట్లూర్‌ ప్రాంతంలో నివాసం ఉండే రవికుమార్‌ (42), శిరీష (33) దంపతులు గురువారం రాత్రి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరణానికి ముందు తమ పిల్లలకు వీడియో కాల్‌ చేసి కన్నీటి వీడ్కోలు పలకడం ఈ ఘటనను మరింత విషాదకరంగా మార్చింది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుశాంత్‌ 9వ తరగతి, చిన్న కుమారుడు విధ్వాంస్‌ 6వ తరగతి చదువుతున్నారు.

చైతన్యపురిలో రవికుమార్‌ బియ్యం దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల రెడీమిక్స్‌ వాహనాన్ని కొనుగోలు చేయడంతో అప్పులు పెరిగి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపినట్లు సమాచారం. గురువారం ఉదయం పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత రవికుమార్‌ ఇంటికి వెళ్లగా, అక్కడ కొందరు మహిళలతో గొడవ జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు.

ఆ తర్వాత రవికుమార్‌, శిరీషలు చైతన్యపురిలోని బియ్యం దుకాణం వద్దకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి సుమారు 7.30 గంటల సమయంలో వారు పిల్లలకు వీడియో కాల్‌ చేశారు. ఆ సమయంలో తల్లిదండ్రులు పిల్లలకు తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోవాలని, ఇద్దరూ గొడవలు పెట్టుకోవద్దని సూచనలు ఇచ్చారు.

తమ్ముడిని బాగా చూసుకో.. మీరు కొట్టుకోవద్దు.

తల్లిదండ్రుల మాటల్లో విచిత్రమైన మార్పు గమనించిన పిల్లలు వారు ఎక్కడ ఉన్నారు, ఎందుకు అలా మాట్లాడుతున్నారంటూ ప్రశ్నించగా, కొద్దిసేపట్లో ఇంటికి వస్తామని చెప్పి కాల్‌ ముగించినట్లు తెలుస్తోంది. అనంతరం ఘట్‌కేసర్‌ పరిధిలో రైలు కింద పడి దంపతులు బలవన్మరణం పాలయ్యారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వ్యాపార, వ్యక్తిగత వివాదాలు, ఆర్థిక పరిస్థితులపై ఆరా తీస్తూ ఆత్మహత్యకు గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. దంపతుల ఆత్మహత్యతో కుంట్లూర్‌, చైతన్యపురి ప్రాంతాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.