రాయలసీమ న్యూస్, తిరుపతి:
సైబర్ నేరాలపై ప్రత్యేక నిఘా!
రూ.50 వేలలోపు సైబర్ మోసాల బాధితులకు తక్షణ ఊరట
తిరుపతి: సైబర్ నేరాల వల్ల రూ.50 వేలలోపు నగదు కోల్పోయిన బాధితులకు ఇకపై నెలలతరబడి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. గోల్డెన్ పీరియడ్‌లో 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినా, సైబర్ పోలీసులను వెంటనే సంప్రదించినా, కోల్పోయిన నగదును తక్షణమే ఫ్రీజ్ చేసి తిరిగి బాధితుల ఖాతాల్లో జమ చేసే అవకాశం కల్పించారు.
సైబర్ నేరగాళ్లు ప్రస్తుతం APK ఫైల్స్, లోన్ యాప్‌లు, వివిధ లింకులను ప్రజల మొబైల్ ఫోన్లకు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నారు. అవగాహన లేక కొందరు, పరధ్యానంలో మరికొందరు, అత్యాశతో ఇంకొందరు ఆ మాయలో పడి తమ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసుకుంటున్నారు. బాధితుల్లో చాలామంది నగదు ఇతర ఖాతాలకు బదిలీ అయ్యేలోపు స్పందించకపోవడంతో, పోలీసులకు ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేయడం, తిరిగి రికవరీ చేయడం కష్టంగా మారుతోంది.
ఒక్కసారి లావాదేవీ పూర్తయిన తర్వాత కేసు నమోదు చేసి, కోర్టు ఆదేశాలు వచ్చిన తరువాతే బాధితుడికి నగదు అప్పగించే పరిస్థితి నెలకొంటోంది. దీంతో తిరిగి వచ్చే కొద్దిపాటి నగదు కోసం కూడా బాధితులు నెలలతరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.
ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.50 వేలలోపు నగదు కోల్పోయిన సైబర్ బాధితులు 1930కి సమాచారం ఇచ్చిన వెంటనే NCRTC పోర్టల్ ద్వారా ఆ మొత్తాన్ని ఫ్రీజ్ చేస్తారు. ఎఫ్‌ఐఆర్ నమోదు అవసరం లేకుండానే ఆ నగదు ఏ బ్యాంకు నుంచి ఏ ఖాతాకు బదిలీ అయిందో గుర్తించి, తిరిగి బాధితుడి ఖాతాలో జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకోసం సైబర్ పోలీసులు సంబంధిత బ్యాంకులకు లేఖలు జారీ చేస్తారు.
జిల్లాలోని సైబర్ పోలీసులు ఇప్పటికే రూ.50 వేలలోపు నగదు దోపిడీకి గురైన 19 మంది బాధితులకు ఈ విధానంతోనే కోల్పోయిన మొత్తాన్ని తిరిగి జమ చేయించారు.
ప్రతి జిల్లాలో సైబర్ పోలీస్ స్టేషన్‌లు
సైబర్ నేరాల పెరుగుదలను దృష్టిలో పెట్టుకుని ప్రతి జిల్లాలో ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పోలీసు శాఖను ఆదేశించారు. ఇప్పటివరకు పోలీసు కవాతు మైదానంలో మాత్రమే ఉన్న సైబర్ విభాగం ఇక ప్రత్యేక స్టేషన్‌గా మారనుంది.
ప్రస్తుతం ఉన్న పదిమంది సిబ్బంది స్థానంలో కానిస్టేబుళ్లు, ఎస్సైలు, సీఐ, డీఎస్పీ హోదాల్లో కలిపి సుమారు 40 మంది వరకు సిబ్బందిని నియమించనున్నారు. వీరిపై అదనపు ఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉంటుంది.
సైబర్ నేరానికి గురైన వెంటనే అదే స్టేషన్‌లో కేసు నమోదు చేసే అవకాశం ఉంటుంది. ఇతర జిల్లాలకు చెందిన బాధితులైనా అక్కడే జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసుకునే వెసులుబాటు కల్పించనున్నారు. కేసు నమోదు కాగానే సైబర్ పోలీసులు సంబంధిత ప్రాంతాలకు వెళ్లి రికవరీ చర్యలు చేపట్టి, నిందితులను అరెస్టు చేయడం ద్వారా బాధితులకు త్వరగా న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటారు.
నూతన సైబర్ పోలీస్ స్టేషన్లు పూర్తిస్థాయిలో ఏర్పాటయ్యే వరకు, ప్రస్తుతం ఉన్న సైబర్ వార్ రూమ్ ద్వారా బాధితులకు సేవలు అందించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేస్తున్నాయి. సైబర్ నేరాలపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు.













