తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న విషాద ఘటన స్థానికులను కలచివేసింది. అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి చికిత్స కోసం డబ్బులు సమకూర్చాలనే ఆవేదనతో ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన ఇన్సూరెన్స్ డబ్బులను తండ్రి వైద్యం కోసం వినియోగించాలని కోరుతూ సూసైడ్ లెటర్ రాసి ప్రాణాలు తీసుకుంది.

పోలీసుల సమాచారం ప్రకారం, తిరుపతి జిల్లాలో సచివాలయంలో ఆక్సిలియరీ నర్స్ Midwife (ANM)గా పని చేస్తున్న సాయిచందన (27) కార్యాలయంలోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో సహచర ఉద్యోగులు, స్థానికులు షాక్‌కు గురయ్యారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అక్కడ నుంచి సూసైడ్ లెటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

సాయిచందన రాసిన సూసైడ్ లెటర్‌లో ఆమె తన తల్లిదండ్రులకు క్షమాపణలు తెలుపుతూ, తండ్రి చికిత్స కోసం ఇన్సూరెన్స్ డబ్బులను వినియోగించాలని స్పష్టంగా పేర్కొంది. తన మరణాన్ని పాముకాటు లేదా కరెంట్ షాక్‌లా నమోదు చేయాలని, అలా చేస్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందడం సులభమవుతుందని భావించినట్లు లేఖలో వెల్లడైంది.

మమ్మీడాడీ నన్ను క్షమించండి. నేను రూ.60 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించాను. నా ఆఖరి కోరిక మేరకు పాముకాటు లేదా కరెంట్ షాక్ లాగా డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి. ఆ డబ్బుతో నాన్నకు ట్రీట్‌మెంట్ చేయించండి.

యువతి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సాయిచందన తండ్రి అనారోగ్య స్థితి, చికిత్స ఖర్చులు, ఇన్సూరెన్స్ పాలసీ వివరాలపై కూడా విచారణ జరుపుతున్నారు.

సాయిచందన మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది. తండ్రి చికిత్స కోసం తన ప్రాణాలను త్యాగం చేసిన ఘటనపై స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వైద్య ఖర్చుల భారంతో యువతులు, యువకులు ఇలాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవడం ఆందోళన కలిగించే అంశమని సామాజిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈ ఘటన ద్వారా ఆర్థిక, వైద్య సమస్యలు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సమయానుకూల సహాయం, కౌన్సెలింగ్ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. సాయిచందన మృతి కేసును పోలీసులు అన్ని కోణాల్లో పరిశీలిస్తూ, పూర్తి వివరాలు వెలికితీసే ప్రయత్నం చేస్తున్నారు.