విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు: జీవితకాల విమాన ప్రయాణ నిషేధం దిశగా కేంద్రం

దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలకు వరుసగా వస్తున్న నకిలీ బాంబు బెదిరింపులపై కేంద్ర ప్రభుత్వం కఠిన వైఖరి ఎత్తుకుంది. శంషాబాద్ (హైదరాబాద్), దిల్లీ, బెంగళూరు, ముంబయి, చెన్నై వంటి ప్రధాన ఎయిర్‌పోర్టులకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి తరచూ వస్తున్న ఫేక్ మెయిల్స్, ఫోన్ కాల్స్ కారణంగా భద్రతా దళాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఈ తరహా అల్లరి చర్యలకు చెక్ పెట్టేందుకు పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులకు పాల్పడే వారిపై విమాన ప్రయాణాల నుంచి జీవితకాల నిషేధం విధించే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందుకోసం చట్టపరమైన ప్రక్రియలను వేగవంతం చేస్తున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

ఇటీవల ఉదయం 8 గంటల సమయంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిన ఘటన ఈ సమస్య తీవ్రతను మరోసారి వెలుగులోకి తెచ్చింది. ఆ రోజు ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సపోర్ట్ మెయిల్‌కు వరుసగా మూడు సందేశాలు చేరాయి. కొన్ని నిర్దిష్ట విమానాల్లో బాంబులు పెట్టారని, ప్రయాణికుల ప్రాణాలకు ప్రమాదం ఉందని ఆ మెయిల్స్‌లో పేర్కొన్నారు. వెంటనే ఎయిర్‌పోర్ట్‌లోని బాంబ్ థ్రెట్ అసెస్‌మెంట్ కమిటీ రంగంలోకి దిగి, సంబంధిత విమానాలను రన్‌వేకు దూరంగా తరలించి సమగ్ర తనిఖీలు నిర్వహించింది. అనంతరం అవి నకిలీ బెదిరింపులేనని తేలడంతో అధికారులు, ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఫిబ్రవరి నుంచి మే మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఇలాంటి 32 నకిలీ బెదిరింపులు నమోదైనట్లు సమాచారం. పెరుగుతున్న ఈ ముప్పును అరికట్టేందుకు అధికారులు ఎయిర్‌క్రాఫ్ట్ (సెక్యూరిటీ) చట్టం, 2023లోని కొన్ని కీలక నిబంధనలను సవరించారు. కేంద్ర ప్రభుత్వం అనుమతితో త్వరలో అమల్లోకి రానున్న ఈ నిబంధనల ప్రకారం, తప్పుడు బాంబు సమాచారం ఇచ్చే నిందితులకు ఘటన తీవ్రతను బట్టి కనీసం రూ. 1 లక్ష నుంచి గరిష్టంగా రూ. 1 కోటి వరకు జరిమానా విధించనున్నారు. జరిమానాతో పాటు గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష కూడా విధించేలా చట్టాన్ని కఠినతరం చేశారు.

ఇంటెలిజెన్స్ వర్గాలు, పోలీసులు జరిపిన విచారణలో దాదాపు 80 శాతం కేసుల్లో నిందితులు వ్యక్తిగత అవసరాలు, స్వార్థ ప్రయోజనాలు లేదా సరదా కోసం ఇలాంటి చర్యలకు ఒడిగడుతున్నట్లు బయటపడింది. పోలీసులు పట్టుకున్న కొందరు నిందితుల వింత కారణాలు అధికారులను కూడా ఆశ్చర్యానికి గురి చేశాయి. తాను ఎయిర్‌పోర్ట్‌కు ఆలస్యంగా చేరుకునే పరిస్థితి రావడంతో, బాంబు బెదిరింపు వస్తే విమానం ఆగిపోతుందనే తప్పుడు అంచనాతో ఒకరు ఏప్రిల్ 8న ఈమెయిల్ పంపిన ఘటనను అధికారులు గుర్తించారు. గతంలో 15 నిమిషాల ఆలస్యంతో చేరడంతో చెక్-ఇన్ మూసివేశారనే కక్షతో బెంగళూరు వెళ్లే విమానంలో బాంబు ఉందంటూ మరొకరు ఫోన్ చేసిన కేసు కూడా నమోదు అయింది. అలాగే, విమానం ఆగిపోతే ఎలా ఉంటుందో చూడాలనే ఉద్దేశంతో కేవలం 13 ఏళ్ల బాలుడు సరదాగా బెదిరింపు మెయిల్ పంపిన ఘటనను కూడా విచారణలో గుర్తించారు.

ఇలాంటి నకిలీ కాల్స్ కారణంగా భద్రతా తనిఖీలు పూర్తి అయ్యే వరకు విమానాలను నిలిపివేయాల్సి వస్తోంది. దీనివల్ల విమానయాన సంస్థల విలువైన సమయం వృథా కావడంతో పాటు కోట్ల రూపాయల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. కేంద్రం తీసుకోబోతున్న జీవితకాల విమాన ప్రయాణ నిషేధం, భారీ జరిమానాల నిర్ణయాలు ఇలాంటి అల్లరి మూకల ఆటలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అధికారులు భావిస్తున్నారు.