రేషన్ బియ్యానికి స్టీమ్ రైస్‌

– రాష్ట్రంలో 1,000 మినీ మార్టులు ఏర్పాటు

: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ బియ్యానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో రేషన్ షాపుల ద్వారా స్టీమ్ రైస్ అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రేషన్‌ షాపుల్లో స్టీమ్ రైస్ పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు ఆయన ప్రకటించారు.

రాష్ట్రంలో రేషన్‌ బియ్యాన్ని ప్రజలు పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే, అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టవచ్చని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ స్టీమ్ రైస్‌ను మధ్యాహ్న భోజన పథకంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, త్వరలోనే 1,000 మినీమార్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు నాదెండ్ల మనోహర్ చెప్పారు. ఈ మినీ మార్టుల ఏర్పాటు కోసం జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (ఎన్‌సీసీఎఫ్‌) సహకారం తీసుకోనున్నట్లు వివరించారు.

ఈ మినీ మార్టుల్లో కార్పొరేట్‌ స్థాయి రేంజ్‌లో రేషన్‌కార్డులు ఉన్న లబ్ధిదారులకు తక్కువ ధరకే బియ్యం, ఇతర నిత్యావసరాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. పంచదార, గోధుమ పిండి, మిల్లెట్స్‌, పామాయిల్‌ వంటి నిత్యావసర సరుకులను రాయితీతో తక్కువ ధరలకు అందించే విధంగా పథకాలు రూపొందిస్తున్నట్లు చెప్పారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌరసరఫరాల శాఖ ద్వారా ఎన్నో సంస్కరణలు అమలు చేశామని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రేషన్ కార్డులపై నేతల ఫోటోలు, పార్టీల రంగులు ముద్రించారని విమర్శించారు.

విజయవాడ, విశాఖపట్నంలో పైలట్‌ ప్రాజెక్టుగా సీబీడీసీ (డిజిటల్‌ రూపాయి) వాలెట్‌ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఈ వాలెట్ ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన సరుకులు కొనుగోలు చేసుకునే వీలు ఉంటుందని తెలిపారు.

రేషన్‌ బియ్యం మళ్లింపుపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 5,354 కేసులు నమోదు చేసినట్లు నాదెండ్ల మనోహర్ వివరించారు. గత ప్రభుత్వం రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసినప్పటికీ, వారికి చెల్లించాల్సిన డబ్బులను పెండింగ్‌లో ఉంచిందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రెండు విడతల్లో రూ.1,674 కోట్లు రైతుల అకౌంట్‌లకు జమ చేసిందని, పౌరసరఫరాల సంస్థ, శాఖ ద్వారా ఈ చెల్లింపులు పూర్తిచేశామని తెలిపారు.

రాష్ట్రంలో మొత్తం 27,756 రేషన్‌ షాపుల ద్వారా ప్రతి నెలా 16.88 లక్షల మంది వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్‌ సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు. సిలిండర్‌ ధర పెరిగినా కూడా రాయితీని క్రమం తప్పకుండా అందిస్తున్నామని, రాష్ట్రంలో అర్హులైన పీఎన్‌జీ లబ్ధిదారులకు కూడా రాయితీ కొనసాగుతున్నట్లు వివరించారు.

ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 17.97 లక్షల మంది రైతుల నుంచి రూ.30,361 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేసినట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు. రైతులకు 24 గంటల్లోనే డబ్బులు జమ చేసే విధానాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. చిన్న రైతులు, కౌలు రైతుల కోసం రూ.50 కోట్లతో టార్పాలిన్లు కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

మొత్తం మీద ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని పౌరసరఫరాలశాఖకు సంబంధించి త్వరలో మరికొన్ని మార్పులు, సంస్కరణలు అమలు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.