రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు ఆమోదం పొందాయి. దేశీయంగా చమురు, సహజవాయువు నిల్వలను పెంచడంతో పాటు ఉత్పత్తిని వేగవంతం చేయడానికి రూపొందించిన ‘సముద్ర మంథన్–నేషనల్ ఆఫ్‌షోర్ ఎక్స్‌ప్లోరేషన్ స్కీమ్’కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకానికి రూ.84,084 కోట్ల వ్యయం అంచనా వేయబడింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
దేశంలో చమురు, సహజవాయువు అన్వేషణ, ఉత్పత్తి వేగాన్ని పెంచడం ఈ పథకం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతానికి ఇంధన అవసరాల కోసం విదేశీ దిగుమతులపై భారత్ అధికంగా ఆధారపడుతున్న నేపథ్యంలో, ఆ దిగుమతి ఆధారితతను తగ్గించి దీర్ఘకాలిక ఇంధన భద్రతను బలోపేతం చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ 2025 ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో ఈ కార్యక్రమాన్ని తొలిసారిగా ప్రకటించారు. దేశ సముద్ర జలాల్లో హైడ్రోకార్బన్ అన్వేషణను విస్తరించేందుకు ఇది కీలక అడుగుగా కేంద్రం భావిస్తోంది. సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయువు అన్వేషణను మరింత విస్తృతం చేసి, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు సాంకేతిక అభివృద్ధికి ప్రోత్సాహం ఇవ్వడం ఈ పథకం లక్ష్యం. అభివృద్ధి చెందిన భారత్ సాధనలో కూడా ఈ కార్యక్రమం కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
సముద్ర చమురు, సహజవాయువు అన్వేషణకు సంబంధించిన మొత్తం విలువ గొలుసులో ఈ పథకం కింద పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. అధిక నాణ్యత కలిగిన భూకంప సంబంధిత డేటాను పెద్ద ఎత్తున సేకరించడం, ప్రాసెసింగ్ చేయడం, విశ్లేషించడం ఇందులో భాగంగా ఉంటుంది. అలాగే లోతైన సముద్ర, అత్యంత లోతైన సముద్ర ప్రాంతాల్లోని బ్లాకుల్లో అన్వేషణ డ్రిల్లింగ్‌ను వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇప్పటివరకు పెద్దగా అన్వేషించని కొత్త సముద్ర బేసిన్‌లలో శాస్త్రీయ పద్ధతుల్లో డ్రిల్లింగ్ చేపట్టడం, సముద్ర చమురు ఉత్పత్తి కోసం ఉమ్మడి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం, ఉత్పత్తి అయిన చమురు, గ్యాస్‌ను తీర ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన వ్యవస్థలను ఏర్పాటు చేయడం కూడా పథకంలో భాగంగా ఉన్నాయి. దీనితో పాటు సమగ్ర ఆయిల్ అండ్ గ్యాస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ జోన్ ను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తోంది.
పథకం అమలు, పర్యవేక్షణ కోసం డిజిటల్ ప్రోగ్రాం మానేజిమెంట్ వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు. నైపుణ్యాభివృద్ధి, కొత్త సాంకేతిక పరిజ్ఞానాల వినియోగం, సంబంధిత వర్గాల భాగస్వామ్యం, అంతర్జాతీయ సహకారానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సముద్ర చమురు, గ్యాస్ అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు అవసరమైన సమగ్ర వ్యవస్థను అభివృద్ధి చేయడమే ఈ చర్యల లక్ష్యంగా పేర్కొంది.
‘సముద్ర మంథన్’ పథకం ద్వారా భారత్ హైడ్రోకార్బన్ నిల్వలకు 600 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు సమాన పరిమాణం కంటే ఎక్కువ నిల్వలు అదనంగా చేరే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. సముద్ర ప్రాంతాల్లో చమురు, సహజవాయువు అన్వేషణ కార్యకలాపాలు పెరగడంతో పాటు దేశీయ ఉత్పత్తి కూడా గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది.
ఈ పథకం ద్వారా కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడటంతో పాటు Make ఇన్ ఇండియా , ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాలకు మరింత బలం చేకూరుతుందని ప్రభుత్వం తెలిపింది. దేశీయ తయారీ రంగం అభివృద్ధి చెందడంతో పాటు సముద్ర చమురు, గ్యాస్ రంగానికి సంబంధించిన సాంకేతికతలు, సేవల్లో ప్రపంచ స్థాయిలో పోటీపడగల వ్యవస్థ ఏర్పడుతుందని అంచనా వేసింది.
చమురు, సహజవాయువు అన్వేషణ నుంచి ఉత్పత్తి వరకు ఉన్న మొత్తం విలువ గొలుసులో ఈ పథకం భారీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. దీని ద్వారా పరిశ్రమల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలు, దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి కొత్త అవకాశాలు సృష్టించబడతాయని వెల్లడించింది.
కేబినెట్ సమావేశంలో ఇతర పథకాలకు కూడా భారీ నిధుల కేటాయింపులు ఆమోదం పొందాయి. ప్రైమ్ మినిస్టర్ సూర్య సరోవర్ యోజన కోసం రూ.5,070 కోట్లు, ప్రైమ్ మినిస్టర్ కిసాన్ సమ్మాన్ నిధి కోసం రూ.3,15,614 కోట్లు, ఖేళో ఇండియా , నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ స్కీం కోసం రూ.36,441 కోట్లు, సముద్ర మంథన్ కోసం రూ.84,084 కోట్లు, క్వీన్ ట్యూబ్ టన్నెల్స్ నిర్మాణం కోసం రూ.9,779 కోట్లు కేటాయించారు. మొత్తంగా రూ.4,50,988 కోట్ల నిధుల విడుదలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.













