రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
రాముడు–కుంభకర్ణుడి యుద్ధమే ‘వారణాసి’ హైలైట్?
వరంగల్: దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి, సూపర్‌స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘వారణాసి’ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ భారీ ప్రాజెక్ట్ కథాంశంపై ఇప్పటికే ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టిన నేపథ్యంలో, సినిమా చుట్టూ ఆసక్తి మరింతగా పెరిగింది.
విజయేంద్రప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం, ‘వారణాసి’ వినూత్నమైన టైమ్ ట్రావెల్ కథాంశంతో తెరకెక్కుతోంది. రామాయణ కాలం, ప్రస్తుత కలియుగం మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ చిత్రంలో కొత్త కోణంలో ఆవిష్కరించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. భారతీయ సినిమా చరిత్రలో తొలిసారిగా రాముడు, కుంభకర్ణుడి మధ్య జరిగే భీకర యుద్ధాన్ని ఈ చిత్రంలో మేజర్ హైలైట్‌గా చూపించనున్నట్లు సమాచారం.
ఇప్పటివరకు తెరపై వచ్చిన రామాయణ గాథల్లో ఎక్కువగా రాముడు–రావణాసురుడి మధ్య క్లైమాక్స్ యుద్ధాన్నే పీక్స్‌లో చూపిస్తూ వచ్చారు. అయితే ‘వారణాసి’లో మాత్రం రావణ లంకపై దండెత్తే క్రమంలో రాముడు, మరణం లేనట్టుగా చూపబడే అజేయుడైన కుంభకర్ణుడితో తలపడే ఎపిసోడ్‌ను ప్రత్యేకంగా మలుస్తున్నారని టాక్. ఈ యుద్ధ ఘట్టం ఏకంగా 30 నిమిషాల నిడివితో సాగనుందని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.
రాజమౌళి అసాధారణ విజన్‌తో తెరకెక్కబోయే ఈ యాక్షన్ బ్లాక్, ‘ఆర్ఆర్ఆర్’లోని భీకర పోరాటాల రేంజ్‌లోనే కాక, ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో చిరస్థాయిగా నిలిచే దృశ్యకావ్యంగా మిగిలిపోతుందని సినీ పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఈ సినిమా విడుదలైన తర్వాత కుంభకర్ణుడి పాత్ర గురించి ప్రేక్షకులు గూగుల్‌లో వెతికే స్థాయిలో ఈ పాత్రను, యుద్ధాన్ని డిజైన్ చేశారనే ప్రచారం వినిపిస్తోంది.
ఈ 30 నిమిషాల కుంభకర్ణ–రామ యుద్ధ సన్నివేశాన్ని కనులవిందుగా చూపించేందుకు యూనిట్ భారీగా ఖర్చు చేస్తోందని సమాచారం. కేవలం ఈ ఒక్క ఫైట్ ఎపిసోడ్ విజువలైజేషన్, హై ఎండ్ VFX గ్రాఫిక్స్ కోసం మాత్రమే నిర్మాతలు దాదాపు 85 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించినట్లు ఇండస్ట్రీ టాక్ చెబుతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్‌కు తోడు శ్రీరాముడిగా మహేష్ బాబు పరాక్రమం తెరపై కనబరిస్తే, థియేటర్లలో ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఇంత భారీ బడ్జెట్‌ను కేవలం ఒక్క యాక్షన్ బ్లాక్‌కే వెచ్చిస్తున్నారంటే, రాజమౌళి ఈ ఎపిసోడ్‌ను ఏ స్థాయి గ్లోబల్ ప్రమాణాలతో ప్లాన్ చేస్తున్నారో అర్థమవుతోందని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఇదిలా ఉండగా, కథలో దాగి ఉన్న మరో ఆసక్తికర అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఈ గ్లోబల్ అడ్వెంచర్ మూవీలో మలయాళ వెర్సటైల్ నటుడు పృథ్వీరాజ్ సుకూమారన్ విలన్ పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఫ్యూచరిస్టిక్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో ఆయన పోషిస్తున్న పాత్ర పేరును ‘కుంభ’గా పరిచయం చేశారు. అంటే పురాణ కాలంలో కుంభకర్ణుడు, భవిష్యత్తు ప్రపంచంలో ‘కుంభ’ అనే విలన్ – ఈ రెండింటికీ మధ్య ఏదో బలమైన, ఆసక్తికరమైన లింక్ ఉండొచ్చని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
రామాయణంలో కుంభకర్ణుడికంటే పవర్‌ఫుల్ విలన్‌గా రావణాసురుడు ఉన్నట్లే, ‘వారణాసి’లో కూడా ‘కుంభ’ వెనుక నుంచి నడిపించే మరో మైండ్ బ్లోయింగ్ సూపర్ విలన్ ఉంటాడా? అన్న ప్రశ్న ఇప్పుడు సినీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవేళ అలాంటి పాత్ర ఉంటే, ఆ మెయిన్ విలన్‌గా ఎవరిని ఎంపిక చేస్తారు? అన్న ఉత్కంఠ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ పెరుగుతోంది.













