రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి జిల్లా ఓజిలి మండలం కారూరు గ్రామంలో సుమారు రూ.57 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఆక్టేవ్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ప్రారంభమైంది. ఈ పరిశ్రమ ప్రారంభం కావడం నియోజకవర్గ పారిశ్రామిక వికాసానికి శుభపరిణామమని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ పేర్కొన్నారు.
శుక్రవారం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి కంపెనీలోని వివిధ విభాగాలను పరిశీలించారు. ఔషధాల తయారీ కోసం ఏర్పాటు చేసిన ఆధునిక యంత్ర పరికరాలు, ఉత్పత్తి ప్రక్రియలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె, కంపెనీ నిర్వహణతో వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ మాట్లాడుతూ మానవ వైద్యానికి అవసరమయ్యే నాణ్యమైన ఔషధాలను ఇక్కడ తయారు చేసి, దేశ విదేశాలకు ఎగుమతి చేసే స్థాయిలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో పరిశ్రమను నెలకొల్పడం అభినందనీయమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సెంట్రిఫ్యూజ్, డ్రైయింగ్ వంటి అధునాతన సాంకేతిక యంత్రాలు కంపెనీలో అందుబాటులో ఉండటం వల్ల ఉన్నతమైన మందుల ఉత్పత్తి సాధ్యమవుతుందని ఆమె తెలిపారు.
ఈ పరిశ్రమ ద్వారా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించబడనున్నాయని, ఈ నేపథ్యంలో స్థానిక యువతకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే కంపెనీ యాజమాన్య ప్రతినిధులు సురేష్, రవి తదితరులను ప్రత్యేకంగా కోరారు. వీలైనంత ఎక్కువ ఉద్యోగాలను స్థానికులకు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నిరంతర కృషితో నియోజకవర్గంలోని అత్తివరం, మేనకూరు, తడ, శ్రీసిటీ, మాంబట్టు ప్రాంతాలు పారిశ్రామిక వాడలుగా వేగంగా రూపుదిద్దుకుంటున్నాయని ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.
భవిష్యత్తులో మరిన్ని పరిశ్రమలను నియోజకవర్గానికి రప్పించి ప్రజలకు విస్తృత ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆక్టేవ్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ మరింతగా విస్తరించి, ప్రాంతానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ, కంపెనీ యాజమాన్యానికి ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.













