తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న విక్టరీస్ ఫ్యూచర్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్‌పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి బ్లాక్ (ఏ.ఐ.ఎస్.బి) ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం కడప ఆర్.జీ.డి కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పాఠశాల నిర్వహణలో జరుగుతున్న అక్రమాలు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులు, తల్లిదండ్రులు నష్టపోతున్నారని నాయకులు ఆరోపించారు.

ధర్నాలో పాల్గొన్న ఏ.ఐ.ఎస్.బి రాష్ట్ర అధ్యక్షులు సగిలి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ, రైల్వేకోడూరు పట్టణంలోని విక్టరీస్ ఫ్యూచర్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తోందని, సి.బి.ఎస్.ఈ సిలబస్ పేరుతో తప్పుడు ప్రచారం చేస్తూ అక్రమంగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థుల నుండి వేల రూపాయల ఫీజులు వసూలు చేస్తూ అనేక అక్రమాలకు పాల్పడుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా పాఠశాల నిర్వహణకు మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే పాఠశాల భవనంలోనే హాస్టల్ నిర్వహిస్తున్నారని, ఏసీ క్యాంపస్ అంటూ ప్రచారం చేసి అధికారులను, తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఏ.ఐ.ఎస్.బి నాయకులు పేర్కొన్నారు. జిల్లా అధికారులకు అనేక సార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు విమర్శించారు.

పట్టణంలో విక్టరీ స్కూల్స్ బ్రాంచ్‌లకు సరైన సదుపాయాలు కూడా లేవని, పాఠశాలకు ప్లే గ్రౌండ్, పార్కింగ్ ప్లేస్ వంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం విద్యార్థుల హక్కులకు విరుద్ధమని నాయకులు తెలిపారు. విద్యా సంస్థలపై పర్యవేక్షణలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి అక్రమాలు పెరుగుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు.

రైల్వేకోడూరులోని విక్టరీ స్కూల్స్‌పై సంబంధిత అధికారులు తక్షణ విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అంశాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఏ.ఐ.ఎస్.బి నాయకులు డిమాండ్ చేశారు. అక్రమాలు కొనసాగితే, అధికారుల నిర్లక్ష్యం కొనసాగితే మరింత తీవ్రమైన ఆందోళనలు చేపట్టే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.

ఈ ధర్నాలో ఏ.ఐ.ఎస్.బి నాయకులు మణి, అఖిల్, చింటూ, జీవన్ తదితరులు పాల్గొని నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రయోజనాలను కాపాడేందుకు పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.