సూళ్ళూరుపేట వై జంక్షన్‌లో ఫ్లెక్సీ విరిగి పడిపాటు… పెద్ద ప్రమాదం తప్పిన ఘటన

సూళ్ళూరుపేట: తిరుపతి జిల్లా సూళ్ళూరుపేట పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే ప్రధాన వై జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీ కింద భాగం విరిగి రహదారిపై పడిపోవడంతో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది. నిత్యం వాహనాలు, కాలినడకన వెళ్లే ప్రజలతో కిక్కిరిసిపోయే ఈ ప్రాంతంలో ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా, బలహీనమైన కర్రల సాయంతోనే ఫ్లెక్సీని కట్టడం స్థానికుల్లో ఆందోళనకు గురిచేసింది.

అకస్మాత్తుగా వీచిన ఈదురుగాలుల ధాటికి సపోర్టుగా పెట్టిన కర్రలు తట్టుకోలేకపోవడంతో, ఫ్లెక్సీ కింద భాగం ఒక్కసారిగా విరిగి రహదారిపై కూలిపోయింది. సాధారణంగా క్షణం తీరిక లేకుండా ఉండే ఈ కూడలిలో, ఆ సమయంలో అదృష్టవశాత్తూ వాహనదారులు, బాటసారులు ఎవరూ ఆ ప్రాంతంలో లేకపోవడంతో ప్రాణనష్టం, గాయాలు ఏవీ సంభవించలేదు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

లేకపోతే వేగంగా వచ్చే బైకర్లు లేదా కాలినడకన వెళ్లే ప్రజలపై ఆ విరిగిన కర్రలు, ఫ్లెక్సీ భాగాలు పడితే తీవ్ర గాయాలు, ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తేవని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ఘటనతో కొంతసేపు ఆ ప్రాంతంలో వాహన రాకపోకలు అంతరాయం కలిగాయి. ఫ్లెక్సీ భాగాలను తొలగించడంతో ట్రాఫిక్ మళ్లీ సాధారణ స్థితికి చేరింది.

ఇంతటి రద్దీ ప్రాంతంలో మున్సిపల్ అధికారుల పర్యవేక్షణ పూర్తిగా లోపించడం వల్లే ఇలాంటి నిర్లక్ష్యపు కట్టడాలు వెలుస్తున్నాయని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం వేలాది మంది సంచరించే ప్రధాన కూడలిలో బలహీనమైన కర్రలతో ప్రమాదకరంగా ఫ్లెక్సీలు కడుతుంటే, సంబంధిత అధికారులు ఎలా చూసీచూడనట్లు వదిలేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు.

ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని, రద్దీ ప్రాంతాల్లో గాలికి విరిగిపోకుండా ఇనుప ఫ్రేమ్‌లు, బలమైన నిర్మాణాలతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేలా స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మున్సిపల్ అధికారులు వెంటనే చర్యలు తీసుకుని, అనుమతి లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు.