తిరుమల మొదటి ఘాట్‌రోడ్డులో చోరీకి గురైన హనుమంతుడి విగ్రహాన్ని అక్కడే యథాతథంగా తితిదే ఏర్పాటుచేసింది. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఘాట్‌రోడ్‌లోని ఏడో మైలు వద్ద ప్రసన్న ఆంజనేయస్వామి ఆలయం పెద్ద విగ్రహం కింద పూజలు అందుకుంటున్న హనుమంతుడి చిన్న విగ్రహాన్ని జశ్వంత్‌ కుమార్‌ అపహరించాడు. గోవిందమాల ధరించి ఘాట్‌రోడ్డుపై నుంచి ఆలయం వద్దకు వచ్చి.. నిన్న తెల్లవారుజామున 3 గంటలకు విగ్రహాన్ని తీసుకుని వస్త్రంలో చుట్టుకుని పారిపోయాడు. ఒంగోలు స్టేషన్‌ వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, విజిలెన్స్‌ సమన్వయంతో 14 గంటల్లో నిందితుడిని పట్టుకున్నారు.

‘‘తితిదే సంప్రదాయాల ప్రకారం హనుమంతుడి విగ్రహానికి పుణ్యాహవచనం చేశాం. ఆలయం చుట్టూ గ్రిల్స్‌ ఏర్పాటు చేస్తున్నాం. అలిపిరి మెట్ల మార్గంలో ఉన్న విగ్రహాలకు సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతాం. అవాంఛనీయ ఘటనలు జరిగినా పట్టుకునే వ్యవస్థ తితిదే వద్ద ఉంది’’ అని తితిదే అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు.