రాయలసీమ న్యూస్, తిరుపతి:
తితిదే ఆలయాల్లో సిబ్బంది కొరత..
సేవల నిర్వహణకు సవాళ్లు
తిరుమల శ్రీవారి భక్తి సామ్రాజ్యం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్న వేళ తితిదే ఆధ్వర్యంలోని ఆలయాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా కనిపిస్తోంది. కొత్తగా అనేక ప్రాంతాల్లో స్వామివారి ఆలయాలు నిర్మాణం పూర్తిచేసుకుని భక్తులకు అందుబాటులోకి వస్తున్నా, వాటిలో ధార్మిక, పరిపాలనా సేవలు నిర్వహించేందుకు అవసరమైన మానవ వనరులు సరిపడా లేవని క్షేత్రస్థాయిలో స్పష్టమవుతోంది.
తిరుమల ప్రధాన ఆలయంతో పాటు తితిదే ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ప్రస్తుతం 65 ఆలయాలు ఉన్నాయి. చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లోని ప్రధాన అనుబంధ ఆలయాలకు రోజూ 5 వేల నుంచి 10 వేల వరకు భక్తులు తరలివస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న ఆలయాల్లోనూ రోజుకు 100 నుంచి 150 మంది వరకు భక్తుల రద్దీ నమోదవుతోంది. ఈ పెరిగిన భక్తుల తాకిడికి అనుగుణంగా సేవలందించేందుకు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
ధూపదీప నైవేద్యాలు, నిత్య కైంకర్యాలు ఆగమోక్తంగా నిర్వహించాలన్నా, పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగాలన్నా తగిన సంఖ్యలో అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, వేద పారాయణదారులు, ఇతర ధార్మిక సిబ్బంది, అలాగే కార్యాలయ సిబ్బంది అవసరం. అయితే తితిదే అనుబంధ, టేకెన్ ఓవర్ ఆలయాల్లో ప్రస్తుతం ఈ విభాగాలన్నింటిలోనూ సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. కొత్త ఆలయాలు ప్రారంభమవడం, భక్తుల రద్దీ విపరీతంగా పెరగడంతో పాత సిబ్బందితోనే అన్ని పనులను నెట్టుకురావడం కష్టసాధ్యమైందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో తితిదే పాలకమండలి పలుమార్లు సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. ప్రభుత్వానికి నివేదికలు పంపి కొత్త పోస్టుల సృష్టి అవసరాన్ని వివరించింది. తొలి విడతలో మొత్తం 413 పోస్టుల సృష్టికి బోర్డు తీర్మానించింది. ఇందులో అర్చకులు 126, పరిచారకులు 57, పోటు వర్కర్లు 146తో పాటు మరికొన్ని ధార్మిక పోస్టులు ఉన్నాయి. రెండో విడతలో ప్రాధాన్యతా క్రమంలో అదనంగా 227 పోస్టులు ప్రతిపాదించారు. వీటిలో వేద పారాయణదారులు 54, అధ్యాపకులు 10, మేళం సిబ్బంది 163 పోస్టులు ఉన్నాయి. ఈ రెండు విడతలుగా కలిపి మొత్తం 640 కొత్త పోస్టుల సృష్టికి బోర్డు ఆమోదం తెలిపినా, ఇప్పటివరకు అవి కార్యరూపం దాల్చకపోవడంతో ఆలయాల నిర్వహణలో ఇబ్బందులు కొనసాగుతున్నాయి.
ప్రతిరోజూ సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు ఆగమ శాస్త్రాల ప్రకారం స్వామివారికి సేవలు జరగాలి. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల రద్దీకి అనుగుణంగా పూజా కార్యక్రమాలు, దర్శన ఏర్పాట్లు నిర్వహించాల్సి ఉంటుంది. రోజువారీ కైంకర్యాలతో పాటు వార, మాస, వార్షిక ఉత్సవాలు సక్రమంగా నిర్వహించాలంటే తగినంత సంఖ్యలో రెగ్యులర్ ధార్మిక, ధార్మికేతర సిబ్బంది అవసరమని ఆలయ నిర్వాహకులు సూచిస్తున్నారు.
అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. అనేక చోట్ల కనీసం సహాయకుడు కూడా లేకుండా, ఉన్న కొద్దిపాటి సిబ్బందే ఉదయం నుంచి రాత్రి వరకు అన్ని పనులు నిర్వహిస్తూ నెట్టుకొస్తున్నారు. భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో సిబ్బంది కొరతను తక్షణమే తీర్చకపోతే సేవల నాణ్యతపై ప్రభావం పడే అవకాశముందని స్థానిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.













