‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రాలతో వరుస విజయాలు సాధించి ఉత్సాహంగా ఉన్న అగ్రహీరో వెంకటేశ్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం:47’ (ఏకే47) విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.

ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కుటుంబ నేపథ్యంలో, వినోదాత్మక శైలిలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం పట్ల సినీప్రియుల్లో ఇప్పటికే మంచి ఆసక్తి నెలకొంది.

ఎస్‌. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. తనన్‌ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. త్రివిక్రమ్‌ కథ, మాటలు, దర్శకత్వం, వెంకటేశ్‌ నటన, తమన్‌ సంగీతం, శ్రీనిధి శెట్టి పాత్రల సమ్మేళనంతో కుటుంబమంతా కలిసి చూసే చిత్రంగా రూపొందుతుందనే అంచనాలు ఉన్నాయి.

శనివారం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ను సోషల్‌ మీడియా వేదికగా పంచుకుంది చిత్రబృందం. పోస్టర్‌లో వెంకటేశ్‌ పాత్ర రూపురేఖలు, కుటుంబ నేపథ్యంలో ఉండే వాతావరణం సినీప్రియుల్ని ఆకట్టుకుంటున్నాయి. అక్టోబరు 2 విడుదలతో దసరా సీజన్‌కి ముందుగానే ఈ చిత్రం థియేటర్లలో సందడి చేయనుంది.

ఇటీవల వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న వెంకటేశ్‌కి ఈ చిత్రం మరొక కీలక ప్రాజెక్ట్‌గా భావిస్తున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వం, కుటుంబ కథా నేపథ్యం, వినోదం, భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చే కథన శైలి ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచుతున్నాయి. అక్టోబరు 2న విడుదలయ్యే ‘ఆదర్శ కుటుంబం హౌస్‌ నెం:47’ (ఏకే47) కోసం అభిమానులు, ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.