నాగార్జున–అనిల్ రావిపూడి కాంబోపై హల్‌చల్‌: టాక్ షోలో డైరెక్టర్ వ్యాఖ్యలు హాట్ టాపిక్

కింగ్ నాగార్జున, క్రేజీ దర్శకుడు అనిల్ రావిపూడి పేర్లు ఒకేసారి వినిపిస్తే చాలు, ఈ కాంబినేషన్‌లో సినిమా వస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో ఎప్పటినుంచో ఉంది. గతంలో సోషల్ మీడియాలో వీరిద్దరి కాంబినేషన్‌పై అనేక వార్తలు వచ్చినప్పటికీ అవన్నీ చివరికి పుకార్లుగానే మిగిలిపోయాయి. అయితే తాజాగా అనిల్ రావిపూడి స్వయంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి.

ఒక టాక్ షో ప్రమోషన్ కార్యక్రమంలో అనిల్ రావిపూడితో పాటు సీనియర్ నటి రాధ పాల్గొన్నారు. ఆ సందర్భంగా రాధ తన కెరీర్‌ను గుర్తుచేసుకుంటూ, తాను గతంలో చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున వంటి నలుగురు అగ్ర హీరోలతో సినిమాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు.

రాధ వ్యాఖ్యలపై స్పందించిన అనిల్ రావిపూడి, తాను ఇప్పటికే చిరంజీవి , బాలకృష్ణ , వెంకటేష్ లతో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన విషయాన్ని గుర్తు చేశాడు. అదే సందర్భంలో నాగార్జున గురించి కీలక వ్యాఖ్య చేశారు.

నేను ఇప్పటికే చిరు, బాలయ్య, వెంకీలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ నిర్మించాను. నాగార్జున గారితో కూడా త్వరలోనే ఒక మూవీ చేయబోతున్నాను.

అనిల్ రావిపూడి నోటి నుంచి వచ్చిన ఈ ఒక్క మాటతోనే నాగార్జున – అనిల్ రావిపూడి ప్రాజెక్ట్ దాదాపు ఖాయమైందనే ఊహాగానాలు సినీ వర్గాల్లో జోరందుకున్నాయి. ఈ ప్రాజెక్ట్ నిజంగా పట్టాలెక్కితే, ఒకే తరం నుంచి వచ్చిన చిరంజీవి , బాలకృష్ణ , విక్టరీ వెంకటేష్ , నాగార్జున అనే నలుగురు టాప్ సీనియర్ స్టార్ హీరోలను దర్శకత్వం వహించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి ప్రత్యేక రికార్డు నెలకొల్పనున్నాడని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో అక్కినేని అభిమానులు విస్తృతంగా స్పందిస్తున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్‌లో తమ హీరోను చూడాలని, ముఖ్యంగా ‘ హలో బ్రదర్ ’ తరహా బుల్లోడు ఇమేజ్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ కామిక్ మాస్ రోల్‌లో నాగార్జునను మళ్లీ చూడాలనే కోరికను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అనిల్ రావిపూడి , వెంకటేష్ , కళ్యాణ్ రామ్ లతో కొత్త చిత్రానికి జాయిన్ అయ్యాడు. ఈ చిత్రం 2027 సంక్రాంతి రేసులో నిలిచేలా షూటింగ్ జరుపుకోనుంది. మరోవైపు కింగ్ నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాను ‘ రా కార్తీక్ ’ దర్శకత్వంలో చేస్తూ బిజీగా ఉన్నాడు.

ఈ చిత్రం పూర్తయ్యాక అనిల్ రావిపూడి దర్శకత్వంలో నాగార్జున సినిమా ప్రారంభమయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఆ ప్రకటన వెలువడితే అక్కినేని అభిమానుల్లో మరింత జోష్ నింపడం ఖాయంగా కనిపిస్తోంది.