రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ‘పెద్ది’ విజయం హీరో రామ్ చరణ్ కు అత్యంత కీలకంగా మారింది. ‘రంగస్థలం’ తర్వాత ఆ స్థాయి నటన, విజయాన్ని అందించిన చిత్రం ఆయన కెరీర్లో రాలేదు. ‘వినయ విధేయ రామ’, ‘ఆచార్య’, ‘గేమ్ ఛేంజర్’ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో చరణ్‌పై ఒత్తిడి పెరిగింది. మధ్యలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చరణ్‌ను గ్లోబల్ స్టార్‌గా నిలబెట్టినా, ఆ విజయాన్ని దర్శకుడు రాజమౌళి హీరో జూ ఎన్ఠీఆర్ లతో కలిసి పంచుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో చరణ్ ఆశలన్నీ ఇప్పుడు ‘పెద్ది’పైనే ఉన్నాయి.
ఇప్పటికే విడుదలైన ‘మస్స మస్స’ పాటలో చరణ్ పెట్టిన కష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి తాను ఎంతగా శ్రమించాడో చరణ్ పలు సందర్భాల్లో ప్రస్తావించాడు. ‘పెద్ది’పై ఆయనకు ఉన్న నమ్మకం, అంచనాలు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ఈ సినిమా విజయం చరణ్ తదుపరి ప్రాజెక్టులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని పరిశ్రమలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే దర్శకుడు సుకుమార్ తో కొత్త సినిమా ప్రకటించిన చరణ్, ఆ ప్రాజెక్ట్ సెట్స్‌పైకి రావడానికి కనీసం ఏడాది నుంచి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ‘పెద్ది’తో హిట్ సాధించాల్సిన అవసరం చరణ్‌కు మరింతగా పెరిగింది.
ఇక దర్శకుడు బూచి బాబు కు ఇది ద్వితీయ విఘ్నం పరీక్షగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలో మొదటి సినిమా హిట్ కొట్టి, రెండో సినిమా వద్ద విఫలమైన దర్శకుల సంఖ్య తక్కువ కాదు. ఆ సెంటిమెంట్‌ను బద్దలు కొట్టిన వారు మాత్రం చాలా అరుదు. ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన బూచి బాబు, అవార్డులు కూడా సొంతం చేసుకున్నారు. దాదాపు ఐదేళ్లుగా ‘పెద్ది’ కథతో ప్రయాణం చేసిన ఆయన, ఇప్పుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇండస్ట్రీ సెంటిమెంట్‌ను చెరిపేసి మరో విజయాన్ని అందుకోవాలంటే ‘పెద్ది’ సక్సెస్ బూచి బాబు కు తప్పనిసరి అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
హీరోయిన్ జాహ్నవీ కపూర్ విషయానికొస్తే, శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, ఇప్పటివరకు బ్లాక్‌బస్టర్ విజయం మాత్రం ఆమెను వరించలేదు. తెలుగులో ‘దేవర’తో ఎంట్రీ ఇచ్చినా, ఆ పాత్రకు పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ‘పెద్ది’లో ‘అచ్చియ్యమ్మ’ పాత్రలో కనిపించనున్నారు. జాహ్నవీ కారణంగానే ఈ చిత్రానికి కళ వచ్చిందని బూచి బాబు ఇప్పటికే పేర్కొన్నారు. ఆమె కెరీర్‌కు ‘పెద్ది’ టర్నింగ్ పాయింట్ కావాలని, తెలుగులో మరింత రాణించాలంటే ఈ సినిమా విజయం అవసరమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
సంగీత దర్శకుడు రెహమాన్ కు కూడా ‘పెద్ది’ ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌గా మారింది. ఆస్కార్ అందుకున్న ఈ మహానుభావుడు తమిళ, హిందీ చిత్రాలకు అందించిన సంగీతంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, నేరుగా చేసిన తెలుగు చిత్రాల సంగీతం మాత్రం పెద్దగా మెప్పించలేదనే అభిప్రాయం ఉంది. అయితే ‘పెద్ది’ కోసం ఆయన సమకూర్చిన ‘చికిరి’ పాట ఆ అనుమానాలను కొంతవరకు పారద్రోలింది. అనంతరం వచ్చిన ‘రయ్ రయ్ రారా’, ‘హల్లో హల్లల్లో’, ‘మస్స మస్స’ పాటలు అంచనాలను మరింత పెంచాయి. వీటన్నింటికంటే ముఖ్యంగా చూడాల్సింది నేపథ్య సంగీతం. స్పోర్ట్స్ డ్రామా, బలమైన భావోద్వేగాలు కలిగిన ఈ చిత్రంలో కీలక సన్నివేశాలను ఎలివేట్ చేయడంలో సంగీతం ప్రధాన పాత్ర పోషించనుంది. అది ఎంతవరకు సక్సెస్ అయిందో త్వరలోనే తేలనుంది.
ఇక నటులు శివ రాజ్ కుమార్ పోషించిన ‘గౌర్నాయుడు’, జగపతి బాబు చేసిన ‘అప్పలసూరి’, ‘రామ్ బుచ్చి’ పాత్రలపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. వీరిలో ఎవరి పాత్ర బాగా నచ్చినా, తెలుగులో మరిన్ని వైవిధ్యమైన పాత్రలు దక్కే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ ముగ్గురితో పాటు మొత్తం తెలుగు సినీ పరిశ్రమే ఇప్పుడు ‘పెద్ది’ విజయాన్ని వేయికళ్లతో ఎదురుచూస్తోంది. సంక్రాంతి తర్వాత వరుసగా పది రోజులు బాక్సాఫీస్ కళకళలాడిన సందర్భం ఇటీవలి కాలంలో కనిపించలేదు. ఆ లోటును ‘పెద్ది’ భర్తీ చేస్తే, ఇండస్ట్రీకి కొంత ఊపిరి పీల్చుకునే అవకాశం లభిస్తుంది. ఇక సినిమా విడుదలకు చాలా తక్కువ సమయమే మిగిలి ఉంది. మరికొన్ని గంటల్లోనే ‘పెద్ది’ ఏ స్థాయి విజయాన్ని సాధిస్తుందో తేలనుంది.







