రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: టాలీవుడ్లో థియేటర్ రెంట్, పర్సెంటేజ్ వ్యవహారంపై ఇటీవల నెలకొన్న వివాదం ఇంకా చల్లారకముందే, రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన పర్సెంటేజ్ ఇష్యూ కొత్త మలుపు తిరిగింది. నిర్మాతల వర్గం, ఎగ్జిబిటర్ల వర్గం మధ్య నెలకొన్న విభేదాలు అప్పటికే తీవ్ర స్థాయికి చేరుకుని వ్యక్తిగత విమర్శల దాకా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ‘పెద్ది’ విడుదలపై కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి.
అయితే పర్సెంటేజ్ విధానంపై చివరకు రెండు వర్గాలు ఒకే అభిప్రాయానికి రావడంతో, ఎలాంటి అడ్డంకులు లేకుండా ‘పెద్ది’ను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల చేశారు. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో టికెట్ ధరల పెంపుతో వచ్చే అదనపు వసూళ్లలో ఎగ్జిబిటర్లకు ఇవ్వాల్సిన శాతం విషయంలో ప్రత్యేక ఒప్పందం కుదిరినట్లు సమాచారం వెలువడింది.
ఈ నేపథ్యంలో ‘పెద్ది’ చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు తాజాగా స్పందించారు. నైజాంలో టికెట్ ధరల పెంపు ద్వారా వచ్చే వసూళ్లలో ఎగ్జిబిటర్లకు 7.5 శాతం అదనపు వాటా హామీ ఇచ్చిన విషయంపై తనకు ఎలాంటి సమాచారం లేదని, తన అనుమతి లేకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని ఆయన లేఖ ద్వారా వెల్లడించినట్లు తెలిసింది. సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల ఈ అంశం తన దృష్టికి రాలేదని, అందువల్ల ఆ కమిట్మెంట్ను తాను అంగీకరించలేనని నిర్మాత లేఖలో పేర్కొన్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలపై ఫిలిం ఛాంబర్ కఠినంగా స్పందించింది. ఈ వ్యవహారానికి సంబంధించి మే 27వ తేదీనే సదరు నిర్మాతకు అధికారిక లేఖ ద్వారా సమాచారం అందించామని ఛాంబర్ స్పష్టం చేసింది. ప్రెస్ నోట్‌తో పాటు ఈ కమిట్మెంట్కు సంబంధించిన అన్ని వివరాలను అదే రోజు ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్‌కు ఈమెయిల్ ద్వారా, అలాగే కొరియర్ ద్వారా డాక్యుమెంట్లు పంపినట్లు ఛాంబర్ తన కౌంటర్ లేఖలో పేర్కొంది.
ఇక జూన్ 15న నిర్మాత వెంకట సతీష్ కిలారు నుంచి వచ్చిన తిరస్కరణ సమాధానంపై ఎగ్జిబిటర్ల సబ్-కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే థియేటర్ రెంట్, పర్సెంటేజ్ అంశాలపై నిర్మాతలు–ఎగ్జిబిటర్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ఈ తాజా పరిణామం మరింత చర్చనీయాంశంగా మారింది.
ఇప్పుడీ వివాదం ఎలా మలుపు తిరుగుతుందో, ‘పెద్ది’ సినిమా తదుపరి షోస్, వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.







