రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: హీరో రామ్ పోతినేని కథానాయకుడిగా, ఆయనే దర్శకుడు, నిర్మాతగా ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభిస్తున్న విషయం ఇప్పటికే తెలిసింది. ఇటీవల ఈ సినిమాను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ తాజా వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటి వరకు ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీనిధి శెట్టి పేరు వినిపిస్తూ వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా వినిపించిన ఆ పేరుకు బదులుగా ఇప్పుడు కొత్త నాయిక పేరు ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. యువ ప్రేక్షకుల లేటెస్ట్ హార్ట్ థ్రోబ్‌గా నిలుస్తున్న కయాదు లోహర్‌ను ఈ సినిమాలో భాగం చేసేందుకు చిత్రబృందం ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలోనే ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేసే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
Rapo 23 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని రాపో సినిమాటిక్స్ పతాకంపై రామ్ సోదరుడు కృష్ణ పోతినేని నిర్మిస్తున్నారు. స్టైలిష్ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో ఈ సినిమా రూపుదిద్దుకోనుంది. ఇందులో రామ్ ‘వీర’ అనే యువకుడి పాత్రలో కనిపించనున్నాడు. కథ, పాత్ర రెండూ కూడా రామ్ కెరీర్‌లో కొత్త కోణాన్ని చూపించేలా ఉండబోతున్నాయని పరిశ్రమలో వినిపిస్తున్న మాట.
ఈ ప్రాజెక్ట్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేసి డిసెంబరులోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని రామ్ భావిస్తున్నట్టు సమాచారం. షూటింగ్ షెడ్యూల్, ఇతర నటీనటుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
రామ్ కెరీర్ ప్రయాణం చూస్తే మొదట మాస్ లవర్ బాయ్‌గా ఆరంగేట్రం చేసి, తరువాత యాక్షన్ హీరోగా, ఆ తర్వాత క్లాస్ లవర్ బాయ్‌గా, మధ్యలో ఫ్యామిలీ హీరోగా కూడా తనను తాను మార్చుకుంటూ వచ్చాడు. ఇటీవలి కాలంలో తనలోని మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం ప్రారంభించాడు.
కొన్ని సంవత్సరాల క్రితం సాయి ధరమ్ తేజ్ సినిమా ‘రేయ్’కి రామ్ నరేటర్‌గా వ్యవహరించాడు. తరువాత ‘హలో గురూ ప్రేమ కోసమే’ చిత్రంలో ‘ఐడియా చెప్పు ఫ్రెండు’ అనే పాటను ఆలపించాడు. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ సినిమాలో ‘నువ్వుంటే చాలే’ అనే పాటను రాయడంతో పాటు అదే చిత్రంలో ‘పప్పీ షేమ్’, ‘పాడు పాడు’ పాటలను కూడా పాడాడు. ఇంకా 11 ఏళ్ల వయసులో ‘ఆడయాళం’ అనే షార్ట్ ఫిలింలో నటించి యూరోపియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న విషయం తెలిసిందే.
ఇలా నటనతో పాటు గానం, రచన, నరేషన్ వంటి విభిన్న రంగాల్లో తన ప్రతిభను చూపించిన రామ్ ఇప్పుడు దర్శకుడిగా, నిర్మాతగా కూడా తనను తాను నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో Rapo 23లో హీరోయిన్ ఎంపికపై వస్తున్న తాజా వార్తలు సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి.







