రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: సినిమా, ఓటీటీ, నిర్మాణం, సేవా కార్యక్రమాలు, వ్యక్తిగత జీవితం... ఇలా పలు రంగాల్లో సమంత తనదైన ముద్ర వేసుకుంటోంది. వెండితెరపై విభిన్న పాత్రలతో మెప్పిస్తూనే, ఓటీటీ వేదికలపై కూడా వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నటిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఆరోగ్యం, ఫిట్నెస్, ఆర్థిక స్వావలంబన వంటి అంశాలపై అభిమానులతో తరచూ తన అనుభవాలను పంచుకుంటూ టచ్‌లో ఉంటుంది. త్వరలో ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఉదయాన్ని ఎలా ప్రారంభిస్తుందో సమంత స్వయంగా వివరించింది. ప్రశాంతమైన ఉదయం మిగతా రోజంతా ఉత్సాహంగా గడవడానికి దోహదం చేస్తుందని ఆమె భావిస్తోంది. ఎన్నో మార్నింగ్ రొటీన్స్ ప్రయత్నించిన తర్వాత ఇప్పుడు ఒక సులభమైన పద్ధతికి అలవాటు పడిందని చెబుతోంది.
“నిద్ర లేచాక గంటపాటు ఫోన్ ముట్టుకోకపోవడం, ధ్యానం, సూర్యరశ్మి తగిలేలా కూర్చోవడం, గోరువెచ్చటి నీళ్లలో పసుపు - నిమ్మరసం కలిపి తాగడం, హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు ఆ రోజు చేయాలనుకున్న పనులను క్లుప్తంగా రాసుకోవడం... ఇదే నా పవర్ మార్నింగ్”
సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సమంతకు చిన్ననాటి ఆర్థిక ఇబ్బందులు బాగా గుర్తున్నాయి. ఆ అనుభవాలే ఆమెను పెట్టుబడుల వైపు మళ్లించాయి. నటిగా సంపాదించిన మొత్తాన్ని ఫ్యాషన్, హెల్త్, వెల్త్ వంటి విభిన్న వ్యాపారాల్లో పెట్టుబడులుగా మలుస్తోంది. ఆర్థిక స్వాతంత్య్రమే నిజమైన స్వేచ్ఛని, అదే గొప్ప విజయమని ఆమె భావిస్తోంది. అందుకే అమ్మాయిలందరూ తమపై నమ్మకంతో ముందడుగు వేసి ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచిస్తోంది.
సమంత పుట్టి పెరిగింది చెన్నైలోనే. చదువుతో పాటు పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేసింది. ఆ సమయంలో ఓ యాడ్ ఏజెన్సీ వ్యక్తి ద్వారా దర్శకుడు గౌతమ్ మేనన్‌కు పరిచయమై, ‘ఏమాయ చేసావె’లో అవకాశం దక్కింది. ఆ చిత్రం ద్వారా వచ్చిన ‘జెస్సీ’ పాత్రను ఆమె తన కెరీర్లో అత్యంత ప్రత్యేకంగా భావిస్తోంది.
“తరవాత నేనెన్ని సినిమాలు చేసినా, ‘జెస్సీ’ పాత్ర నాకు చాలా ప్రత్యేకం. నిజంగా చెప్తున్నా... మొదటి రెండు సినిమాల్లో నా నటన చూసి, ‘అరె.. ఇలా నటించానేంటీ?’ అనుకుంటా. అయితే, వాటి నుంచే పాఠాలు నేర్చుకున్నా”
సూర్య, మహేశ్‌బాబు నటన తనకు ఎంతో ఇష్టమని సమంత పేర్కొంది. తనకు ఇంతటి స్టార్డమ్ ఇచ్చిన సినీ పరిశ్రమ కోసం ఏదైనా చేయాలనే ఆలోచనతో కొత్తవారికి అవకాశాలు కల్పించేందుకు ‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించింది. ఈ బ్యానర్‌పై తీసిన తొలి చిత్రం ‘శుభం’లో తాను నటించాలనుకోకపోయినా, అతిథి పాత్ర కోసం వేరెవరినీ అడగలేక చివరికి తానే నటించాల్సి వచ్చిందని చెప్పింది. ‘మా ఇంటి బంగారం’లో చీర కట్టుకుని యాక్షన్ సన్నివేశాల్లో నటించడం తనకు కొత్త అనుభవమని తెలిపింది.
ఆరోగ్య సమస్యలు ఎదురైన తర్వాత తన దృక్పథంలో పెద్ద మార్పు వచ్చిందని సమంత చెబుతోంది. మయోసైటిస్ వచ్చిన సమయంలో నిద్ర, ఆహారం, ప్రశాంతతపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టిందని పేర్కొంది.
“ఎన్ని సినిమాలు చేశామని కాకుండా ఎంత మంచివి చేశామని ఆలోచించే దృక్పథాన్ని అలవర్చుకున్నా. అంతేకాదు, ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ‘టేక్20హెల్త్’ పేరిట నిపుణులతో పాడ్‌కాస్ట్‌లు కూడా నిర్వహిస్తున్నా”
బ్రాండ్ ప్రమోషన్ల విషయంలో కూడా సమంత తన ప్రమాణాలను స్పష్టంగా ఉంచింది. ఏ ఉత్పత్తి సమాజానికి హానికరం కాదని నిర్ధారించుకున్నాకే దాన్ని ప్రచారం చేస్తోంది.
“అందుకే, రూ. కోట్లు కూడబెట్టుకునే అవకాశమైనా... గతేడాది 15 బ్రాండ్లను వదులుకున్నా”
సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి తన తల్లిని చూసే వచ్చిందని సమంత చెబుతోంది. సినిమాలు, బ్రాండ్లు, పెట్టుబడుల ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని ‘ప్రత్యూష సపోర్ట్’ ఫౌండేషన్‌కు కేటాయిస్తోంది.
“సేవలో ఉండే సంతృప్తి వెలకట్టలేనిది”
వ్యక్తిగత జీవితంలో కూడా సమంత కొత్త ఆరంభాన్ని చూసింది. జీవితంలో ఇక ఎవరినీ నమ్మలేనని, ఎవరిపైనా ఆధారపడలేనని అనుకున్న దశలో Raj పరిచయం అయ్యాడని, అతనితో స్నేహం, రిలేషన్షిప్ తర్వాత తనలో చాలా మార్పు వచ్చిందని తెలిపింది. పని, వ్యాయామం, బయటకు వెళ్లడం, ఆటలు... ఏదైనా ఇద్దరూ కలిసి చేయాలనుకుంటారని చెప్పింది.
చిన్ననాటి కలలలో ఒకటి ఈ ఏడాది నిజమైందని సమంత పేర్కొంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి Bhavan లో నిర్వహించే ‘At Home’ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ప్రత్యేక అనుభూతినిచ్చిందని చెప్పింది. అయితే Sydney Universityలో చదవాలనే మరో కల మాత్రం ఇంకా నెరవేరలేదని వెల్లడించింది.







