చేతులు దాటుతున్న సినిమా బడ్జెట్లు.. కుదేలవుతున్న టాలీవుడ్ నిర్మాతలు

తెలుగు చిత్ర పరిశ్రమ ఒక వైపు పాన్ ఇండియా విజయాలతో ఉత్సాహంగా కనిపిస్తున్నా, అంతర్గతంగా మాత్రం బడ్జెట్ భారంతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. మితిమీరిన బడ్జెట్ అంటే కష్టాలను కొనితెచ్చుకోవడమే అని తెలిసినా, టాలీవుడ్ మేకర్స్ ఆ ఊబిలో నుంచి బయటపడలేకపోతున్నారు. పాన్ ఇండియా అనే మాయలో పడిన నిర్మాతలు దాదాపు ప్రతి సినిమాకీ వందల కోట్ల రూపాయలు వెచ్చించే పరిస్థితి నెలకొంది.

విజువల్ వండర్, గ్రాఫిక్స్, భారీ సెట్స్ పేరుతో VFX పై ఖర్చు గణనీయంగా పెరిగిపోతోంది. ఈ వ్యయం చివరికి నిర్మాతలకే తడిసి మోపెగా మారుతోంది. ఒకప్పుడు ఏడాదిలో పూర్తయ్యే సినిమాలు ఇప్పుడు రెండు, మూడు ఏళ్ల పాటు లాగడం సాధారణమైపోయింది. షూటింగ్ కాలం పెరిగేకొద్దీ వడ్డీ భారం, ప్రొడక్షన్ ఖర్చులు అమాంతం ఎగబాకి, నిర్మాతలకు కోలుకోలేని దెబ్బతీస్తున్నాయి.

సినిమా మొత్తం బడ్జెట్‌లో దాదాపు సగం భాగం కేవలం హీరో, దర్శకుల పారితోషికాలకే వెళ్తుండటం ఆందోళన కలిగించే అంశంగా మారింది. కొందరు స్టార్ హీరోలు రెండు సినిమాలకు తీసుకునే రెమ్యునరేషన్‌ను ఇప్పుడు ఒక్క సినిమాకే డిమాండ్ చేస్తున్నారని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. స్టార్స్ సినిమాల బడ్జెట్లు ప్రస్తుతం 300 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల వరకు చేరుతున్నాయి.

ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మార్కెట్ లేని లేదా కనీసం 100 కోట్ల వసూళ్ల ట్రాక్ రికార్డ్ కూడా లేని యంగ్ హీరోల సినిమాల బడ్జెట్ సైతం 100 కోట్లను దాటిపోతోంది. తగిన క్రేజ్ లేని హీరోలపై వందల కోట్లు కుమ్మరించడం నిర్మాతలకు ఆత్మహత్యాసదృశ్య నిర్ణయంగా మారుతోందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఓటీటీ హక్కుల విక్రయం కూడా ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో, థియేట్రికల్ రిలీజ్‌లు సైతం కష్టసాధ్యమవుతున్నాయి. ప్రస్తుతం యాష్ నటిస్తున్న టాక్సిక్ , చిరంజీవి ప్రధాన పాత్రలో వస్తున్న విశ్వంభర వంటి భారీ చిత్రాలు కూడా ఇలాంటి బిజినెస్ ఒత్తిడుల నడుమనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం.

పెరిగిన బడ్జెట్‌ను రికవరీ చేయడానికి నిర్మాతలు ప్రధానంగా టికెట్ రేట్ల పెంపుపైనే ఆధారపడుతున్నారు. అయితే ఈ వ్యూహం తిరగబడి, మితిమీరిన టికెట్ ధరల కారణంగా సాధారణ ప్రేక్షకుడు థియేటర్లకు దూరమవుతున్నాడు. నష్టాలకు, కష్టాలకు మితిమీరిన బడ్జెట్లు, పారితోషికాలే ప్రధాన కారణమని స్పష్టంగా కనిపిస్తున్నా, ఇండస్ట్రీ మాత్రం తగ్గేదేలే అన్నట్టుగా అదే తప్పును పునరావృతం చేస్తోంది.

ఇప్పటికైనా నిర్మాతలు, ప్రముఖులు కలిసి బడ్జెట్లను అదుపులో పెట్టే దిశగా కఠిన నిర్ణయాలు తీసుకోకపోతే, టాలీవుడ్ భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది.