రాష్ట్రంలో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో తీర ప్రాంతాలు, రాయలసీమలో వర్షాలు, ఈదురు గాలులు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఉత్తర బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ బాంగ్లాదేశ్ ప్రాంతంలో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 3 నాటికి వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది.

దీనికితోడు ఆంధ్ర ప్రదేశ్ , యానాం పరిధిలోని దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి, పశ్చిమ దిశల గాలులు బలంగా వీస్తున్నాయని వాతావరణ శాఖ వివరించింది. ఈ గాలుల ప్రభావం, బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడన పరిస్థితులు కలిసి రాష్ట్రంలో వర్షాలకు అనుకూలంగా మారుతున్నాయని తెలిపింది.

ఉత్తర కోస్తా పరిధిలో గురువారం కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మూడు రోజుల పాటు ఉత్తర కోస్తా జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది.

దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో కూడా ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వర్షాలు, ఈదురు గాలుల అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని చేపలు పట్టడానికి సముద్రంలోకి వెళ్లే మత్స్యకారులు, తీర ప్రాంత ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

వచ్చే మూడు రోజుల్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో, రైతులు, ప్రజలు స్థానిక వాతావరణ కేంద్రాలు, అధికారుల సూచనలను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.