రాయలసీమ న్యూస్, వెదర్ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల సమయంలో ఈదురు గాలులు, పిడుగులు ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) నిరంతరం ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.
తాజాగా రాష్ట్రంలోని పలు జిల్లాలకు కీలక వాతావరణ హెచ్చరికలను ప్రకటించింది. రానున్న మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ మార్పులను గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ముఖ్యంగా విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు సంస్థ స్పష్టం చేసింది. గజపతినగరం, శృంగవరపుకోట, భీమునిపట్నం పరిసర ప్రాంతాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని APSDMA హెచ్చరించింది.
అదే సమయంలో అన్నమయ్య, శ్రీసత్యసాయి, తిరుపతి, చిత్తూరు, అనంతపురం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉన్నట్లు తెలిపింది. వాతావరణ పరిస్థితులు వేగంగా మారే అవకాశం ఉన్నందున స్థానిక ప్రజలు, ప్రయాణికులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాల సమయంలో ప్రజలు, రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్ల కింద లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పిడుగులు పడే సమయంలో ఓపెన్ ప్రదేశాల్లో నిలబడటం, పొలాల్లో పనిచేయడం, ఎత్తైన చెట్లకు, విద్యుత్ స్తంభాలకు దగ్గరగా ఉండటం ప్రమాదకరమని పేర్కొంది.
వర్షాలు, పిడుగుల సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని APSDMA సూచించింది. అత్యవసర అవసరం లేకుండా ప్రయాణాలను వీలైనంత వరకు వాయిదా వేసుకోవాలని, ఇంట్లో లేదా భద్రమైన భవనాల్లో ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, అధికారుల సూచనలను పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించుకోవచ్చని విపత్తు నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.







