రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలు కడప వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో గురువారం సందడిగా కొనసాగాయి. వరుసగా జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు విజయం సాధించాయి. భారీ స్కోర్లు, చుక్కల వెలుగులో ఫ్లడ్‌లైట్ల కాంతి, మధ్య మధ్యలో సంగీత విభావరి.. ఇలా స్టేడియం మొత్తం క్రికెట్ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది.
మధ్యాహ్నం జరిగిన తొలి మ్యాచ్‌లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు, కాకినాడ కింగ్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్ గెలిచిన కాకినాడ కింగ్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి 60 బంతుల్లో 112 పరుగులు నమోదు చేశాడు. లేకజ్‌రెడ్డి 37 పరుగులతో జట్టుకు తోడ్పడ్డాడు. వీరి ఆటతీరుతో కాకినాడ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగుల భారీ స్కోరు చేసింది.
తర్వాత 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు దూకుడుగా ఆడింది. 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి మ్యాచ్‌ను తమ ఖాతాలో వేసుకుంది. జి.ఎస్.పి. తేజ అజేయంగా 76 పరుగులు, తేజారెడ్డి 41 పరుగులు చేశారు. చివరి దశలో వాసు కేవలం 14 బంతుల్లోనే 42 పరుగులు బాదడంతో రాయలసీమ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రాయల్స్ ఆఫ్ రాయలసీమ ఆటగాడు జి.ఎస్.పి. తేజ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
మ్యాచ్‌ల మధ్య విరామ సమయంలో కృష్ణచైతన్య బృందం ప్రదర్శించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. స్టేడియం గ్యాలరీలు హర్షధ్వనులతో మార్మోగాయి.
రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగిన రెండో మ్యాచ్‌లో సింహాద్రి వైజాగ్ లయన్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన వైజాగ్ లయన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్ ఎంచుకుని 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో వీరారెడ్డి, మహీప్‌కుమార్ చెరో 62 పరుగులు చేయగా, ధనుష్ 36 పరుగులతో మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. అమరావతి రాయల్స్ బౌలర్ తోషిత్‌యాదవ్ 2 వికెట్లు తీశాడు.
తర్వాత 203 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన అమరావతి రాయల్స్ జట్టు వైజాగ్ బౌలర్ల ముందు తడబడింది. నిర్ణీత 20 ఓవర్లు పూర్తికాకముందే 19 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌట్ అయింది. జట్టులో ప్రసాద్ 42, గిరినాథ్ 37, వెంకట రాహుల్ 28 పరుగులు చేసినా జట్టును గెలుపు దిశగా నడిపించలేకపోయారు. వైజాగ్ లయన్స్ తరఫున వీరారెడ్డి ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మెరిశాడు. అతడిని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిర్వాహకులు ప్రకటించారు.
రెండు మ్యాచ్‌ల్లోనూ బ్యాట్స్‌మెన్లు రాణించడంతో ప్రేక్షకులు రన్‌ల వర్షాన్ని ఆస్వాదించారు. ఏపీఎల్ పోటీలతో కడప నగరం క్రికెట్ జోష్‌తో కళకళలాడుతోంది.













