ఆగని గ్యాస్‌బండ దోపిడీ

వైఎస్ఆర్‌ కడప జిల్లా వ్యాప్తంగా డొమెస్టిక్‌ వాయుబండల దుర్వినియోగం, నల్లబజారు విక్రయాలు ఆగడం లేదు. గృహ వినియోగానికి మాత్రమే అనుమతించిన సిలిండర్లను బహిరంగంగానే వాణిజ్య అవసరాలకు వాడుతూ, అదనపు ధరలు వసూలు చేస్తున్న పరిస్థితులు కొనసాగుతున్నాయి. విజిలెన్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పౌరసరఫరాల శాఖల పర్యవేక్షణ లోపం కారణంగా అక్రమాలు మరింత పెరిగాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

హోటళ్లు, రెస్టారెంట్లు, కల్యాణమండపాలు, బంగారు అంగళ్లతో పాటు కార్లు, ద్విచక్రవాహనాలు, ఆటోలకు కూడా డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచే గ్యాస్‌ నింపుతున్నారు. గృహ వినియోగ సిలిండర్లను వాణిజ్య రంగంలో వినియోగించడం నిబంధనలకు విరుద్ధమని తెలిసినా, సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి.

జిల్లాలో మొత్తం గ్యాస్‌ కనెక్షన్లు 6,87,336 ఉన్నట్లు అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. వీటిలో సింగిల్‌ సిలిండర్లు 3,13,883, డబుల్‌ వాయుబండలు 1,80,600, దీపం పథకం కింద 2,04,500, ఉజ్వల పథకం కింద 3,063, సీఎస్‌ఆర్‌ కింద 5,340 కనెక్షన్లు ఉన్నాయి. ఈ విస్తృత నెట్‌వర్క్‌ మధ్యలోనే నల్లబజారు, అక్రమ ఫిల్లింగ్‌ కేంద్రాలు పుట్టుకొస్తున్నాయని స్థానిక వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం 14.2 కిలోల డొమెస్టిక్‌ సిలిండర్‌ ధర రూ.1010గా ఉండగా, సరఫరా బాయ్‌ పేరుతో అదనంగా రూ.50 వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో దూరాన్ని కారణంగా చూపుతూ మరింత అధికంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. అధికారిక ధరను పక్కనబెట్టి నల్లబజారులో ఒక్క సిలిండర్‌ను రూ.1,200 నుంచి రూ.1,400 వరకు అమ్ముతున్నారని సమాచారం.

జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో సుమారు 20కి పైగా అక్రమ గ్యాస్‌ ఫిల్లింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు అంచనా. ఇక్కడ డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి గ్యాస్‌ను మరో సిలిండర్లలోకి నింపి కిలోల లెక్కన విక్రయిస్తున్నారు. కిలో గ్యాస్‌ ధరను రూ.150గా నిర్ణయించి వసూలు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడంతో ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డొమెస్టిక్‌ సిలిండర్ల నుంచి నేరుగా కార్లకు, ద్విచక్రవాహనాలకు గ్యాస్‌ నింపుతున్న దృశ్యాలు కూడా ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాల్లో కనిపిస్తున్నాయి. ఇది వినియోగదారుల ప్రాణాలకు, ప్రజా భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు.

ఈ పరిస్థితులపై స్పందించిన ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీటీ శివప్రసాద్‌ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.

అయితే, అక్రమ ఫిల్లింగ్‌ కేంద్రాలు, నల్లబజారు విక్రయాలు ఇంకా కొనసాగుతుండటంతో పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేయాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు. గృహ వినియోగదారులకు కేటాయించిన వాయుబండలు నిజంగా వారి అవసరాలకు చేరేలా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.