కడప జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ కేవలం శుచి, రుచికర భోజనాన్ని అందించడమే కాకుండా విద్యార్థుల్లో క్రమశిక్షణ, పరిశుభ్రత, సమైక్య భావన, నాయకత్వ లక్షణాలను పెంపొందించే వినూత్న కార్యక్రమంగా విద్యా రంగంలో స్ఫూర్తిని నింపుతోందని జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ JICA నిపుణురాలు యుమికో ఓనిషి ప్రశంసించారు.

బుధవారం జపాన్–భారత్ అభివృద్ధి సహకార కార్యక్రమంలో భాగంగా JICA నిపుణులు యుమికో ఓనిషి, నీతి ఆయోగ్ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కడప జిల్లాలో అమలవుతున్న స్మార్ట్ కిచెన్ నిర్వహణ విధానం, అలాగే "ప్రాజెక్ట్ ఏఎన్‌టీఎస్" అమలు ప్రక్రియను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమగ్రంగా వివరించారు.

జిల్లాలో స్మార్ట్ కిచెన్ కార్యక్రమానికి అనుబంధంగా జిల్లా యంత్రాంగం "ప్రాజెక్ట్ ఏఎన్‌టీఎస్" ( ఆక్షన్ ఫర్ న్యూట్రిషన్ త్రు డిసిప్లిన్ , టీంవర్క్ & శానిటేషన్ ) ను అమలు చేస్తోందని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి వివరించారు. మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమైక్యతా భావన, పరిశుభ్రత, బాధ్యత, నాయకత్వ లక్షణాలు, ఆహారం పట్ల గౌరవం, ఆహార వృథా నివారణ వంటి విలువలను పెంపొందించే అభ్యాస అవకాశంగా ఈ కార్యక్రమాన్ని మలుస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉపాధ్యాయులు, విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం సమన్వయంతో ప్రతిరోజూ నిర్దిష్ట విధానాలను అమలు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన అలవాట్లు పెంపొందించడంతో పాటు పోషకాహారంతో మంచి ప్రవర్తన కలిగిన బాధ్యతాయుత పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడమే "ఏఎన్‌టీఎస్" ప్రాజెక్టు ప్రధాన లక్ష్యమని కలెక్టర్ సమావేశంలో వివరించారు.

సమావేశంలో JICA ప్రతినిధులు స్మార్ట్ కిచెన్ వ్యవస్థ, "ప్రాజెక్ట్ ఏఎన్‌టీఎస్" అమలు విధానంపై వివరాలు తెలుసుకుని, ఈ కార్యక్రమాన్ని అభినందించారు. విద్యార్థుల వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్య పరిరక్షణ, పాఠశాల స్థాయి నిర్వహణలో ఈ విధానం సానుకూల ఫలితాలు ఇవ్వగలదని వారు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం మరింత విస్తృతంగా, స్థిరంగా అమలయ్యేలా కొన్ని సలహాలు కూడా అందించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో JICA బృంద సభ్యులు హితోమీ హమాడా, బినయ్ పట్నాయక్, మోహిత్ సూద్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నీతి ఆయోగ్ రాష్ట్ర నోడల్ అధికారి కార్తీక్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా విద్యా రంగంలో చేపట్టిన ఈ వినూత్న ప్రయత్నం దేశవ్యాప్తంగా ఆదర్శంగా నిలిచే అవకాశముందని సమావేశంలో పాల్గొన్న ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.