ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ పోటీలు కడప వైఎస్‌ రాజారెడ్డి-ఏసీఏ స్టేడియంలో గురువారం సందడిగా కొనసాగాయి. వరుసగా రెండు మ్యాచ్‌లు జరగడంతో స్టేడియం క్రీడాభిమానులతో కిక్కిరిసిపోయింది. రాయలసీమ, వైజాగ్‌ జట్ల విజయాలతో ఏపీఎల్‌ ఉత్సాహం మరింత పెరిగింది.

మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ అఫ్ రాయలసీమ జట్టు కాకినాడ కింగ్స్ పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్‌ గెలిచిన కాకినాడ కింగ్స్ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్‌ అభిషేక్‌ దూకుడు ఇన్నింగ్స్‌ ఆడి 60 బంతుల్లోనే 112 పరుగులు నమోదు చేశాడు. లీకేజ్ రెడ్డి 37 పరుగులు చేయడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగుల భారీ స్కోరు చేసింది.

తర్వాత 212 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్ అఫ్ రాయలసీమ జట్టు ఆత్మవిశ్వాసంగా ఆడింది. 18.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసి గెలుపొందింది. జి.ఎస్‌.పి. తేజ అజేయంగా 76 పరుగులు, తేజ రెడ్డి 41 పరుగులు చేసి జట్టును గెలుపు దిశగా నడిపించారు. చివరి దశలో వాసు కేవలం 14 బంతుల్లో 42 పరుగులు బాదడంతో మరో 9 బంతులు మిగిలి ఉండగానే రాయల్స్ అఫ్ రాయలసీమ లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన జి.ఎస్‌.పి. తేజను ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.

మ్యాచ్‌ల మధ్య విరామ సమయంలో కృష్ణ చైతన్య బృందం ప్రదర్శించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది. స్టేడియం నిండా సంగీతం, చప్పట్ల సందడి నెలకొంది.

రాత్రి ఫ్లడ్‌లైట్ల వెలుగులో కాపిటల్ అమరావతి రాయల్స్ , సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్ల మధ్య మ్యాచ్‌ ఆసక్తికరంగా సాగింది. టాస్‌ గెలిచిన వైజాగ్ లయన్స్ జట్టు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోరు చేసింది. జట్టులో వీర రెడ్డి 62, మహిప్ కుమార్ 62, ధనుష్ 36 పరుగులతో రాణించారు. అమరావతి రాయల్స్ బౌలర్‌ తొషిట్ యాదవ్ 2 వికెట్లు తీశాడు.

తర్వాత 203 పరుగుల లక్ష్యంతో అమరావతి రాయల్స్ బ్యాటింగ్‌కు దిగింది. అయితే వైజాగ్ లయన్స్ బౌలర్లను పెద్దగా ఎదుర్కోలేకపోయింది. 19 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌట్‌ అయింది. జట్టులో ప్రసాద్ 42, గిరినాథ్ 37, వెంకట రాహుల్ 28 పరుగులు చేశారు. చివరకు సింహాద్రి వైజాగ్ లయన్స్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో కీలక ఇన్నింగ్స్‌ ఆడిన వీర రెడ్డి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

రెండు మ్యాచ్‌లతో కడప వైఎస్‌ రాజారెడ్డి-ఏసీఏ స్టేడియం క్రికెట్‌ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. స్థానిక క్రీడాభిమానులు, కుటుంబాలతో వచ్చిన ప్రేక్షకులు ఆటను ఆస్వాదించారు.