రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
తినేదంతా అసలు కాదు: కల్తీ ఆహారంతో వినియోగదారుల ఆరోగ్యం ప్రమాదంలో
ప్రొద్దుటూరు పట్టణం, జిల్లాలో కల్తీ ఆహార పదార్థాల వినియోగం ఆందోళనకు గురిచేస్తోంది. మాంసం, చేపలతో తయారు చేసే వంటకాలను రోజుల తరబడి డీప్ ఫ్రిడ్జ్‌లో నిల్వ ఉంచి, వినియోగదారులు కోరినప్పుడు మసాలాలు దట్టించి వేడిగా వడ్డిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు పెరుగుతున్నాయి. తాజాగా ఉన్నట్లుగా చూపిస్తూ విక్రయించే ఈ పదార్థాల వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
సాస్‌లు, బిర్యానీ, తందూరీ చికెన్‌లలో కృత్రిమ రంగులు కలపడం సాధారణంగా మారింది. మిఠాయిలు, కేకులు, మసాలాలు, మాంసాహారం, బంగాళాదుంప చిప్స్, పాప్‌కార్న్, ఐస్‌క్రీమ్, సూప్‌లు, బఠానీలకు కూడా కృత్రిమ రంగులు జోడించి నాణ్యంగా, తాజాగా ఉన్నట్లుగా చూపి అమ్మకాలు సాగిస్తున్నారు. రోజుల తరబడి నిల్వ ఉంచిన పదార్థాలను తాజాగా ఉన్నాయని భావించి వినియోగిస్తున్న ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఫుడ్ సేఫ్టీ విభాగం గుర్తించింది.
జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 528 ఆహార నమూనాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు వివిధ హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి సేకరించారు. వీటిలో యాభై నమూనాలకు సంబంధించిన పరీక్షా ఫలితాలు అందాయి. ప్రమాణాలు పాటించలేదని తేలడంతో పలువురు వ్యాపారులకు నోటీసులు జారీ చేశారు. ఆహార కల్తీకి పాల్పడిన నలుగురిపై క్రిమినల్ కేసులు, మరో పన్నెండు మందిపై సాధారణ కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.
గత మార్చి నెలలో కడప, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో పాల ఉత్పత్తులతో తయారు చేసే ఆహార పదార్థాల నమూనాలు సుమారు 40 వరకు సేకరించి పరీక్షకు పంపారు. ఒక్క నమూనాలోనూ కొవ్వు పదార్థాలు లేవని తేలడం ఆందోళన కలిగించే అంశంగా అధికారులు పేర్కొంటున్నారు.
ఆహార పదార్థాలు కల్తీ అయ్యాయని అనుమానం వచ్చినప్పుడు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా–2006 చట్టం ప్రకారం వినియోగదారులు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, ఫుడ్ సేఫ్టీ డిజిగ్నేటెడ్ ఆఫీసర్ ఫోన్ నంబరు 9703383684కు ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నంబర్లు 18004253857, 08645...297245 ద్వారా కూడా సమాచారం అందించవచ్చు.
అని జిల్లా ఆహార భద్రతా తనిఖీ అధికారిణి హరిత సూచించారు. కల్తీ ఆహారంపై అవగాహన పెంచేందుకు, హోటళ్లు, రెస్టారెంట్లలో పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాల అమలుపై విభాగం ప్రత్యేక దృష్టి సారించినట్లు అధికారులు వెల్లడించారు.













