రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు పట్టణంలోని సూపర్‌బజార్ రోడ్డులో స్వర్ణకారుడి ఇంట్లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం స్థానిక మూడో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్పీ విబూకృష్ణ కేసు వివరాలను మీడియాకు తెలియజేశారు.
పోలీసుల సమాచారం ప్రకారం, మహారాష్ట్రకు చెందిన అనికేత్ జయవంత్ బాబర్ ప్రొద్దుటూరులో నివసిస్తూ స్వర్ణకారుడిగా పనిచేస్తున్నారు. బంగారం కరిగించడం, అమ్మడం, కొనడం వంటి పనులు చేస్తూ వస్తున్నారు. అతని వద్ద అదే రాష్ట్రానికి చెందిన ప్రథ్మేష్ బాబా సాహెబ్ గుమస్తాగా పనిచేస్తున్నాడు.
బంగారం కొనుగోలు కోసం యజమాని అనికేత్ జయవంత్ బాబర్ రూ.23 లక్షల నగదును సిద్ధం చేసి ఈ నెల 10న తన ఇంట్లో భద్రపరిచాడు. ఈ విషయాన్ని గుమస్తా ప్రథ్మేష్ గమనించాడు. ఆ డబ్బును చోరీ చేయాలనే ఉద్దేశంతో ప్రథ్మేష్ పథకం రచించాడు.
ఈ క్రమంలో మహారాష్ట్రలో ఉన్న తన స్నేహితుడు మిలింద్ చంద్రకాంత్ ఖండేఖర్‌ను ప్రొద్దుటూరుకు పిలిపించాడు. చోరీ చేసిన డబ్బును ఇద్దరూ పంచుకునేలా ముందస్తుగా ఒప్పందం చేసుకున్నారని పోలీసులు తెలిపారు.
ఈ నెల 12న యజమాని అనికేత్ జయవంత్ బాబర్ ఇంటి నుంచి బయటకు వెళ్లిన సమయాన్ని గమనించిన మిలింద్ చంద్రకాంత్ ఖండేఖర్ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ భద్రపరిచిన రూ.23 లక్షల నగదును చోరీ చేశాడు. అనంతరం ఇద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు.
చోరీ జరిగిన విషయం బయటపడడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసిన సీఐ రామాంజనేయుడు, ఎస్సై సంజీవరెడ్డి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తు లో భాగంగా గుమస్తా ప్రథ్మేష్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా, చోరీకి సంబంధించిన అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.
దీనితో ప్రథ్మేష్, మిలింద్ చంద్రకాంత్ ఖండేఖర్‌లను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి మొత్తం రూ.22.91 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ విబూకృష్ణ వివరించారు. మిగిలిన నగదు, కేసుకు సంబంధించిన ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసు అధికారులు పేర్కొన్నారు.













