రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: భూ వివాదం తీవ్రరూపం దాల్చి ఇరువర్గాలు కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగిన ఘటన ప్రొద్దుటూరు మండల పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఈ సంఘటనతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం.. ప్రొద్దుటూరు మండలం రామాపురానికి చెందిన పైడికాల్వ జగన్ ఇటీవల ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన మారుతి ప్రసాద్ వద్ద నుంచి 1.02 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయితే అదే భూమిని మాలెపాడుకు చెందిన మేకల ప్రసాద్‌రెడ్డి గత కొంతకాలంగా సాగు చేసుకుంటూ ఉన్నారు.
కొత్తగా కొనుగోలు చేసిన భూమిలో సేద్యం ప్రారంభించేందుకు పైడికాల్వ జగన్ బుధవారం మరికొంతమంది వ్యక్తులతో కలిసి అక్కడికి వెళ్లారు. ఈ సమయంలో మేకల ప్రసాద్‌రెడ్డి అక్కడికి చేరుకుని ఆ భూమి తమదేనని వాదించారు. ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది.
తరువాత పరిస్థితి అదుపు తప్పి ఇరువర్గాలు కత్తులతో ఒకరిపై ఒకరు దాడులకు దిగినట్లు సమాచారం. ఈ దాడిలో మాలెపాడుకు చెందిన మేకల ప్రసాద్‌రెడ్డి, ఆయన తల్లి వరలక్ష్మి, రామాపురానికి చెందిన పైడికాల్వ ప్రసాద్, ఎర్రదాసరి ప్రతాప్, భరత్ గాయపడ్డారు. వీరికి శరీరంపై తీవ్ర గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు.
క్షతగాత్రుల్లో కొందరిని అత్యవసరంగా జమ్మలమడుగు ఆసుపత్రికి, మరికొందరిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు బాధితులకు చికిత్స అందిస్తున్నారు. సంఘటన సమాచారం అందుకున్న వెంటనే కలమల్ల ఎస్సై సునీల్‌కుమార్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
సీఐ ప్రొద్దుటూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయపడిన వారిని పరామర్శించి వివరాలు సేకరించారు. ఇరువర్గాల నుంచి ఫిర్యాదులు అందిన తర్వాత కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు.
భూ వివాదాల పరిష్కారంలో స్థానిక స్థాయిలో సమన్వయం లేకపోవడం, పత్రాల పరిశీలన సక్రమంగా జరగకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనతో ఆ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొనగా, పోలీసులు అదనపు సిబ్బందిని మోహరించి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.













