రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వై.ఎస్.ఆర్ కడప జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బందికి ఆటంకం కలిగించిన ముగ్గురు వ్యక్తులకు కోర్టు జరిమానా, జైలు శిక్ష విధించింది. ప్రొద్దటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో నమోదైన Cr.No.224/2021 కేసులో ఈ తీర్పు వెలువడింది.
పోలీసుల సమాచారం ప్రకారం, ఫిర్యాదుదారు చింతల ఉదయ్ కుమార్, కానిస్టేబుల్, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్నారు. 07.06.2021న ప్రొద్దుటూరు కమాండ్ కంట్రోల్‌లో విధుల్లో ఉండగా, అదే రోజు సాయంత్రం 4 గంటల సమయంలో గాంధీ బొమ్మ వద్ద ట్రాఫిక్ మూవింగ్ నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో అక్కడి గుండా మోటార్ సైకిల్‌పై వెళ్తున్న కానిస్టేబుల్ రామకృష్ణను షైక్ హూసైన్ మోటార్ సైకిల్‌తో ఢీకొట్టినట్లు పేర్కొన్నారు.
అప్పట్లో అక్కడే విధుల్లో ఉన్న ఫిర్యాదుదారు చింతల ఉదయ్ కుమార్ ఇద్దరినీ సర్ది చెప్పి పంపించినట్లు కేసు వివరాల్లో ఉంది. కొద్దిసేపటి తరువాత ముద్దాయి షైక్ హూసైన్, తనతో పాటు షైక్ అబ్దుల్ అలీమ్ (27 సంవత్సరాలు), షైక్ నాయబ్ రసూల్‌ను పిలుచుకుని వచ్చాడు. ఆ సమయంలో ఫిర్యాదుదారు గాంధీ రోడ్డులోని వైభవ్ హోటల్ వద్ద ఉండగా, పై ముగ్గురు మోటార్ సైకిల్‌పై వచ్చి ఆయనను అడ్డగించి, దుర్భాషలాడుతూ, ప్రాణహానీ బెదిరింపులు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా అప్పటి Sub ఇన్స్పెక్టర్ J. శివ శంకర్, ప్రొద్దటూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో Cr.No.224/2021, U/s 341, 353 IPC కింద కేసు నమోదు చేసి, ముద్దాయిలను అరెస్ట్ చేసి, అనంతరం చార్జ్ షీట్ దాఖలు చేశారు.
ఈ కేసును రాజశ్రీ, ఒకటవ అదనపు ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు విచారించింది. విచారణలో సాక్ష్యాధారాల ఆధారంగా ముగ్గురు ముద్దాయిలు నేరం చేసినట్లు కోర్టు తేల్చింది. దాంతో ముగ్గురికీ ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో ముగ్గురికీ మూడు నెలల జైలు శిక్ష విధించాలని కోర్టు ఆదేశించింది.
ఈ కేసులో ప్రభుత్వ తరఫున Sr.APP శ్రీమతి స్వప్న వాదనలు వినిపించారు. ఆమె వాదనల ఆధారంగా ముద్దాయిలపై నేరం రుజువై శిక్ష పడేలా కృషి చేసినట్లు పోలీసు వర్గాలు తెలియజేశాయి.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేయడం, వారి విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇటువంటి కేసుల్లో చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేస్తున్నారు.













