వైయ‌స్‌ఆర్‌సీపీ అధినేత వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డిపై జనసేన నాయకుడు పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలను ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. పార్టీ నాయకులపై వ్యక్తిగత దూషణలు, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని, పంతం నానాజీ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

మంగళవారం ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులపై మాట్లాడేటప్పుడు ఎప్పుడూ హుందాతనం పాటిస్తారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా అవమానించే పదజాలం ఆయన ఉపయోగించరని, అలాంటి నాయకుడిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కృతికి విరుద్ధమని వ్యాఖ్యానించారు.

వైయ‌స్ జగన్ ధైర్యసాహసాల గురించి మాట్లాడే ముందు దేశ, రాష్ట్ర రాజకీయ పరిణామాలను పంతం నానాజీ గుర్తు చేసుకోవాలని రాచమల్లు సూచించారు. క్లిష్ట పరిస్థితుల్లోనూ వెనుకడుగు వేయకుండా రాజకీయంగా పోరాడిన నాయకుడు వైయ‌స్ జగన్ అని ఆయన అన్నారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో వైయ‌స్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై ఉపయోగించిన పదజాలాన్ని ప్రజలు మరచిపోలేదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గుర్తుచేశారు. ఇతరులను విమర్శించే ముందు తమ నాయకుల వ్యాఖ్యలను కూడా పరిశీలించుకోవాలని జనసేన నేతలకు హితవు పలికారు.

వైయ‌స్‌ఆర్‌సీపీలో కొనసాగుతున్న కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలను కించపరిచేలా మాట్లాడటం బాధాకరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాపు సమాజాన్ని అవమానించేలా ఎవరూ వ్యాఖ్యలు చేయకూడదని సూచించారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చని, అయితే వ్యక్తిగత దూషణలు చేయడం, సామాజిక వర్గాలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు.

వైయ‌స్ జగన్‌పై చేసిన వ్యాఖ్యలను పంతం నానాజీ వెంటనే వెనక్కి తీసుకుని, ప్రజల ముందుకు వచ్చి క్షమాపణ చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మరోసారి డిమాండ్ చేశారు.