రాయలసీమ న్యూస్, అగ్రికల్చర్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా రొయ్యల ఉత్పత్తి, సముద్ర ఆహార ఎగుమతుల విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
దేశవ్యాప్తంగా రొయ్యల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలలో 66 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నదని చంద్రబాబు వివరించారు. ఈ ఆధిక్యాన్ని మరింత బలపరచే దిశగా ఆక్వా రంగంలో నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులను పెంచడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. సముద్ర ఉత్పత్తుల రంగంలో ప్రపంచవ్యాప్తంగా భారత్ రెండో స్థానంలో ఉన్నదని ఆయన గుర్తుచేశారు. ఎగుమతుల పరంగా గత ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం రెట్టింపు స్థాయిలో ఉన్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
ఆక్వా ఉత్పత్తుల రంగంలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, నాణ్యతా ప్రమాణాల మెరుగుదలతో పాటు ఆధునిక సాంకేతిక పద్ధతుల వినియోగంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లు ఆయన తెలిపారు. ప్రపంచ మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన మార్గదర్శకాలు, సాంకేతిక సహాయం అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఆక్వా ఉత్పత్తుల విభాగంలో చైనా, నార్వే, ఈక్వెడార్, వియత్నాం, చిలీ వంటి దేశాలు ముందంజలో ఉన్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దేశాలతో పోటీ పడే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఆక్వా రంగాన్ని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో ఆక్వా రంగం కీలక భాగస్వామ్యమైందని, ఉపాధి అవకాశాల సృష్టిలోనూ ఈ రంగం ప్రాధాన్యం పెరుగుతోందని సీఎం అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాల అమలు, ఎగుమతుల విస్తరణతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్లో మరింత గుర్తింపు పొందేలా చర్యలు కొనసాగనున్నాయని ఆయన స్పష్టం చేశారు.







