రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరు పరిసర ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు విషయంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ రామ్ మోహన్ నాయుడు గారితో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారు, అనంతపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారితో కలిసి ఢిల్లీలో సమావేశమయ్యారు. కూడేరు ఎయిర్‌పోర్టు ప్రతిపాదన, ప్రాంతీయ విమానయాన విస్తరణ, హార్టికల్చర్ అభివృద్ధి వంటి అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్లు సమాచారం.
గతంలో ఏవియేషన్ అధికారులు కూడేరు ప్రాంతంలో నిర్వహించిన సర్వేలో పరిసర కొండలు అడ్డుగా ఉండటంతో విమానాలు రెండు వైపులా ల్యాండింగ్, టేకాఫ్ చేయడం సాధ్యం కాదని నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పయ్యావుల కేశవ్, అంబికా లక్ష్మీనారాయణలు కేంద్ర మంత్రిని మరోసారి ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని కోరారు. పాత విశాఖపట్నం విమానాశ్రయంలో అమలు చేసిన వన్‌సైడ్ ల్యాండింగ్ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని, కూడేరు ప్రాంతంలో కూడా అదే తరహా రన్‌వే ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ లక్ష్యంతో కూడేరు పరిసర ప్రాంతంలో మరోసారి సమగ్ర సాంకేతిక సర్వే నిర్వహించాలని రాష్ట్ర ప్రతినిధులు కేంద్ర పౌర విమానయాన శాఖను కోరినట్లు తెలియజేశారు. భౌగోళిక పరిస్థితులు, గాలుల దిశ, రన్‌వే అమరిక, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలపై నిపుణుల బృందంతో సవివరంగా అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వారు కేంద్ర మంత్రికి వివరించారు.
దేశవ్యాప్తంగా ప్రాంతీయ విమానయానాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఉడాన్ (UDAN) పథకం కింద రాబోయే పదేళ్లలో మరో 100 విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో, అనంతపురం జిల్లాను కూడా ఈ ప్రణాళికలో చేర్చాలని మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్ర మంత్రిని కోరారు. రాయలసీమలో కీలక కేంద్రంగా ఉన్న అనంతపురం జిల్లాకు ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో ప్రాంతీయ కనెక్టివిటీ గణనీయంగా మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఉద్యాన పంటల సాగులో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రగామి జిల్లాల్లో ఒకటని, ఇక్కడి నుంచి పెద్దఎత్తున పండ్లు, కూరగాయలు దేశంలోని వివిధ మార్కెట్లకు తరలుతున్నాయని రాష్ట్ర ప్రతినిధులు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎయిర్‌పోర్టు ఏర్పాటుతో హార్టికల్చర్ కార్గో రవాణాకు విస్తృత అవకాశాలు ఏర్పడి, రైతులు తమ ఉత్పత్తులను దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లకు వేగంగా ఎగుమతి చేసే అవకాశం లభిస్తుందని వారు వివరించారు. దీంతో రైతులకు మెరుగైన గిట్టుబాటు ధరలు లభించి, వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తోందని, ఆ దిశగా అనంతపురం జిల్లాలో ఎయిర్‌పోర్టు ఏర్పాటు కీలక మౌలిక వసతిగా నిలుస్తుందని మంత్రి పయ్యావుల కేశవ్ కేంద్రానికి తెలియజేశారు. కూడేరు ఎయిర్‌పోర్టు ప్రతిపాదనపై కేంద్రం సానుకూలంగా స్పందించి, సాంకేతిక సర్వేకు అనుమతి ఇచ్చి, ఉడాన్ పథకం కింద అనంతపురం జిల్లాను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావంతో ఎదురు చూస్తోంది.













