అమరావతి: తానే హీరోగా సొంతంగా సినిమా తీయాలనే మోజు ఒక వ్యక్తిని నేరాల బాట పట్టించింది. సినిమాపై పిచ్చి, రీల్ లైఫ్‌లో హీరో కావాలనే కలతో అతడు వరుస దొంగతనాలు చేసి కోట్ల రూపాయలు కూడబెట్టాడు. ఆ డబ్బుతో హారర్ సినిమా ప్రారంభించినా, నిధుల కొరతతో ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. అప్పులు పెరగడంతో మళ్లీ దొంగతనాలకు పాల్పడి, మూడు రాష్ట్రాల్లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. చివరకు అనంతపురం పోలీసుల వలలో చిక్కాడు.

కర్నాటక రాజధాని బెంగళూరుకు చెందిన నాగరాజుగారి ఆనంద్‌కు సినిమాలంటే అసాధారణమైన ఇష్టం. తానే హీరో, తానే దర్శకుడిగా మారి ‘రిటర్న్ బై ఆనంద్.. పేజీ నంబరు 13’ అనే హారర్ సినిమాను ప్రారంభించాడు. ఇందుకోసం గతంలో చేసిన దొంగతనాల ద్వారా సంపాదించిన సొమ్ముతో పాటు, తన తల్లి పేరిట ఉన్న సొంత ఇంటిని కూడా అమ్మేసి మొత్తం సుమారు రూ.2.5 కోట్లను సినిమా కోసం ఖర్చు చేశాడు. దాదాపు 40 రోజుల పాటు షూటింగ్ కూడా నిర్వహించాడు.

అయితే చివరి దశలో నిధుల కొరత తలెత్తడంతో సినిమా విడుదల నిలిచిపోయింది. అప్పులు భారీగా పెరగడంతో వాటిని తీర్చుకోవడానికి ఆనంద్ మళ్లీ దొంగతనాల మార్గాన్ని ఎంచుకున్నాడు. సాధారణ ప్రజల ఇండ్లలో దొంగతనం చేస్తే పేదలు, మధ్యతరగతి వారు తీవ్రంగా నష్టపోతారని అతడు భావించాడు. పెద్ద మాల్స్ అయితే ధనవంతులు నడుపుతారని, వాటికి బీమా ఉండటం వల్ల అసలు నష్టం ఎవరికీ ఉండదనే విచిత్రమైన లాజిక్‌తో కేవలం షాపింగ్ మాల్స్‌ను మాత్రమే టార్గెట్ చేశాడు.

బాలీవుడ్ సినిమా ‘ధూమ్’ స్టైల్‌లో అతడు పనిచేసిన విధానం పోలీసులను ఇబ్బంది పెట్టింది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కలిపి 32కి పైగా షాపింగ్ మాల్స్‌లో చోరీలకు పాల్పడి, మూడు రాష్ట్రాల పోలీసులకు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌గా మారాడు. రీల్ లైఫ్‌లో హీరోగా మెరవాలనే తపనతో రియల్ లైఫ్‌లో నేరాల పరంపర కొనసాగించాడు.

ఈ క్రమంలో జూన్ 27న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నగరంలో ప్రసిద్ధ ‘డ్రెస్ సర్కిల్’ మాల్‌లో భారీ దొంగతనానికి ఒడిగట్టాడు. ఈ కేసును సవాల్‌గా తీసుకున్న అనంతపురం పోలీసులు మాల్‌లోని సీసీటీవీ దృశ్యాలు, ఇతర సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుడి గుర్తింపును చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు నిర్వహించి ఆనంద్‌ను పట్టుకున్నారు.

బాలీవుడ్ సినిమా ‘ధూమ్’ స్టైల్‌లో తప్పించుకుంటూ తిరిగిన ఈ కిలాడీని ఎట్టకేలకు పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. నిందితుడి వద్ద నుంచి రూ.5.25 లక్షల నగదు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక కారు, మూడు నంబర్ ప్లేట్లు, ఇనుప రాడ్లు, కట్టర్లు వంటి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. వరుస దొంగతనాలతో మూడు రాష్ట్రాల పోలీసులను మోసం చేసిన ఆనంద్ ఇప్పుడు జైలు గోడల మధ్య ఊచలు లెక్కపెడుతున్నాడు.