రైతుల ఆత్మహత్యలు కూటమి వైఫల్యాలకు నిదర్శనం: డా. సాకే శైలజానాథ్

అనంతపురం జిల్లా రైతులు ఎదుర్కొంటున్న అప్పుల బారిన సమస్యలు, వరుస ఆత్మహత్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట డా. సాకే శైలజానాథ్ ఆధ్వర్యంలో రైతులు, వైయస్ఆర్ సీపీ నాయకులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, గత కొంతకాలంగా జిల్లాలో రైతుల ఆత్మహత్యలు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయని, రైతు కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నప్పటికీ ప్రభుత్వం మాత్రం సమస్యలను పట్టించుకోకుండా ప్రచారాలకే పరిమితమైపోతుందని విమర్శించారు. రైతుల ప్రాణాలు పోతున్నా స్పందించని ప్రభుత్వ వైఖరి బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని ఆయన అభిప్రాయపడ్డారు.

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడుతున్నాడని, వర్షాలు లేకపోయినా, ఎక్కువైనా నష్టపోయేది రైతే అవుతున్నాడని డా. శైలజానాథ్ పేర్కొన్నారు. సాగునీటి సమస్యల వల్ల పంటలు ఎండిపోతున్నాయని, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో దిగుబడులు తగ్గిపోతున్నాయని, పంటలకు సరైన ధరలు లేక రైతులు అప్పుల బారిన పడుతున్నారని ఆయన వివరించారు. ప్రభుత్వం సరైన సమయంలో పరిహారం అందించకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని తెలిపారు.

ఎన్నికల సమయంలో రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను పూర్తిగా మర్చిపోయారని, రైతు సంక్షేమంపై మాటల్లో మాత్రమే మాట్లాడుతున్నారని, క్షేత్రస్థాయిలో రైతుల పరిస్థితి దారుణంగా ఉందని డా. శైలజానాథ్ ఆరోపించారు. రైతు మరణం ఒక్క వ్యక్తి మరణం కాదని, ఆ కుటుంబం మొత్తం అనాథ అవుతుందని, పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని, అలాంటి కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

అన్నదాతల ప్రాణాలు కాపాడాల్సిన సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి కారణంగా జిల్లాలో ఆత్మహత్యల సంఖ్య పెరుగుతోందనే ఆందోళన ప్రజల్లో వ్యక్తమవుతోందని డా. శైలజానాథ్ పేర్కొన్నారు. పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగమయ్య, మడుగుపల్లి గ్రామానికి చెందిన రైతు చంద్రమోహన్, నార్పల మండల కేంద్రానికి చెందిన రైతు ఆదినారాయణ అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను ఆయన ఉదాహరణగా ప్రస్తావించారు.

ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండే పరిస్థితులను సృష్టించడం ప్రభుత్వ బాధ్యత అని, రైతుల ప్రాణాలు రాజకీయాలకు అతీతమని డా. శైలజానాథ్ స్పష్టం చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే పలుమార్లు రైతుల ఆత్మహత్యలు, సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినప్పటికీ స్పందన కనిపించలేదని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్లను స్పష్టంగా తెలియజేస్తున్నట్లు డా. శైలజానాథ్ పేర్కొన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, పంట నష్టాలకు పూర్తి పరిహారం ఇవ్వాలని, సాగునీటి సమస్యలను అత్యవసరంగా పరిష్కరించాలని, రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉంచాలని, పంట బీమా, పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని, రైతు సమస్యలపై ప్రత్యేక జిల్లా మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తించాలని, లేనిపక్షంలో రైతుల పక్షాన, వారికి రావాల్సిన హక్కుల కోసం వైయస్ఆర్ సీపీ పోరాటం కొనసాగిస్తుందని డా. శైలజానాథ్ హెచ్చరించారు.

మాజీ పార్లమెంటు సభ్యుడు తలారి రంగయ్య కూడా రైతుల ఆత్మహత్యల అంశంపై ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి అన్నం పెట్టే రైతు తన ప్రాణాన్ని తానే తీసుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని, రైతు పంట పండిస్తే దేశం బతుకుతుందని, కానీ నేడు రైతు బతుకే ప్రశ్నార్థకంగా మారిందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం రైతుల సమస్యలను గుర్తించి వెంటనే చర్యలు తీసుకోవాలని, రైతుల ఆత్మహత్యలను సాధారణ ఘటనలుగా చూడకూడదని, ప్రతి రైతు కుటుంబానికి న్యాయం జరగాలని, బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించాలని, రైతుల అప్పులను పునర్వ్యవస్థీకరించాలని, పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని, సాగునీటి సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని తలారి రంగయ్య అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు నారాయణరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి, నాయకులు వంశీ గోకుల రెడ్డి, బొమ్మన శ్రీరాంరెడ్డి, చామలూరు రాజ గోపాల్, నాగేశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, పార్టీ మండల అధ్యక్షులు మహేశ్వర్ రెడ్డి, గువ్వల శ్రీకాంత్ రెడ్డి, పరంధామ రెడ్డి, ఎల్లారెడ్డి, పద్మావతి, బయ్యపు రెడ్డి, శివ శంకర్ రెడ్డి, రామకృష్ణా రెడ్డి, బోనాల హరికృష్ణ, ఫణీంద్ర, భాస్కర్ రెడ్డి, వెంకటరాముడు, మధుసూదన్ రెడ్డి, శ్యాంసుందర్ రెడ్డి, కాటమయ్య, రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.