గుంతకల్లు రైల్వే జంక్షన్‌లోని ఆరు, ఏడు ప్లాట్‌ఫారాల మధ్య ఉన్న స్టేషన్‌ భవనాలు శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రయాణికుల్లో భయం నెలకొంది. ఎప్పుడు కూలిపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడిందని వారు చెబుతున్నారు. జంక్షన్‌ను అమ్రిత్ భారత్ స్టేషన్ పథకం జాబితాలో చేర్చడంలో అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చిన్న స్టేషన్ల అభివృద్ధికి అమ్రిత్ పథకం కింద కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రభుత్వం, డివిజన్‌ కేంద్రంగా ఉన్న గుంతకల్లు స్టేషన్‌కు మాత్రం ఈ పథకం కింద నిధులు కేటాయించకపోవడం అన్యాయమని రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్‌ ప్రధాన కార్యదర్శి శంకరయ్య విమర్శించారు. ఇటీవల గుంతకల్లు పర్యటన సందర్భంగా ఆయన ఈ అంశంపై అధికారుల తీరును ఎత్తిచూపారు.

జంక్షన్‌ గుండా వెళ్లే రైళ్లలో ఎక్కువ శాతం 6, 7 ప్లాట్‌ఫారాల నుంచే ప్రయాణిస్తుంటాయి. ఈ రెండు ప్లాట్‌ఫారాల మధ్య వందేళ్ల క్రితం ఆంగ్లేయులు నిర్మించిన భవనాలనే ఇప్పటికీ వినియోగిస్తున్నారు. పై అంతస్తులోని భవనాలు కూలిపోతుండటంతో అధికారులు దాదాపు పదేళ్ల క్రితం వాటిని కూల్చివేశారు. అయితే కింది అంతస్తు పాత భవనాలను మాత్రం యథావిధిగా వినియోగిస్తూనే ఉన్నారు. పూతపూసి పనికొచ్చేలా చూపిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

గత సంవత్సరం మే 23న స్టేషన్‌ భవనానికి చెందిన పైకప్పు సిమెంటు పెచ్చులూడి కర్నూలుకు చెందిన మణికంఠ అనే బాలుడిపై పడటంతో అతడు మృతిచెందిన ఘటన స్థానికులకు గుర్తుండే ఉంది. ఆ సంఘటన అనంతరం ఉన్నతాధికారులు వరుసగా వచ్చి తనిఖీలు చేసినప్పటికీ, భవనాల బలపర్చడంపై స్పష్టమైన చర్యలు కనిపించలేదని ప్రయాణికులు అంటున్నారు.

వర్షాకాలంలో ఆరు, ఏడు ప్లాట్‌ఫారాలు పూర్తిగా నీటితో నిండిపోతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలం చెల్లిన పాత భవనాలను తొలగించి, అమ్రిత్ పథకం కింద కొత్త భవనాలు నిర్మించి ప్రమాదాలను నివారించాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఇక గుంతకల్లు పట్టణం పరిసరాల్లో లెవెల్‌ క్రాసింగ్‌లు కూడా సమస్యలకే కారణమవుతున్నాయి. అకోలా–నెల్లూరు జాతీయ రహదారి పట్టణ శివారులోని బళ్లారి రైల్వే గేట్‌ వద్ద గేటు మూసే సమయంలో వాహనాలు, బస్సులు పెద్ద ఎత్తున నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ సాధారణమైంది. ఇక్కడ రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సుమారు రూ.50 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసినా, నిధులు మంజూరు కాలేదు.

గుంతకల్లు నుంచి కసాపురం మీదుగా కర్నూలుకు వెళ్లే R&B రోడ్డులో సత్యనారాయణపేట వద్ద ఉన్న ఇరుకైన మోరీ ట్రాఫిక్‌కు అడ్డంకిగా మారింది. ఇక్కడ రూ.8 కోట్ల వ్యయంతో వంతెన విస్తరణ పనులు చేపట్టాలని నిర్ణయించినా, ఈ పనులకు కూడా ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదు.