రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: అమరావతి/తిరువనంతపురం : ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం సరికొత్త రికార్డు సృష్టించిందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక సందర్శనలు గణనీయంగా పెరిగి 36.42 కోట్లకు చేరుకున్నాయని ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ పర్యాటకంలో 48 శాతం వృద్ధి నమోదు కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వేగంగా ముందుకు దూసుకుపోతోందని వివరించారు.
కేరళలో జరుగుతున్న పర్యాటక కార్యక్రమాల సందర్భంగా మంత్రి కందుల దుర్గేశ్ రెండో రోజు పర్యటించారు. గురువారం కోవాలంలో జరుగుతున్న ‘గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ (GTM) 2026’ అవార్డుల కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ప్రతిష్ఠాత్మక ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డును మంత్రి దుర్గేశ్ స్వీకరించనున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి కందుల దుర్గేశ్, దక్షిణ భారతదేశాన్ని పర్యాటక రంగంలో ప్రపంచస్థాయి కేంద్రంగా తీర్చిదిద్దాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు. దక్షిణ భారతదేశాన్ని ‘గ్లోబల్ టూరిజం పవర్‌హౌస్’గా మార్చేందుకు అన్ని రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో పెట్టుబడిదారులు, టూర్ ఆపరేటర్లు మరింత చురుకుగా ముందుకు రావాలని మంత్రి దుర్గేశ్ ఆకాంక్ష వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న విభిన్న పర్యాటక అవకాశాలను వినియోగించుకోవాలని, పెట్టుబడులకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉందని ఆయన సూచించారు. గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ప్రత్యేక పెవిలియన్ విశేష ఆకర్షణగా నిలిచిందని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఏపీ పర్యాటక రంగ ప్రగతి, విశిష్టతలను ప్రతిబింబించేలా రూపొందించిన ఈ పెవిలియన్‌ను సందర్శకులు, పర్యాటక నిపుణులు ప్రశంసిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు లభించిన ‘బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్’ అవార్డు రాష్ట్ర పర్యాటక విధానాలు, ప్రోత్సాహక కార్యక్రమాలకు లభించిన గుర్తింపుగా అధికారులు భావిస్తున్నారు. ఈ అవార్డు ద్వారా ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అంతర్జాతీయ వేదికపై మరింత గుర్తింపు పొందే అవకాశం ఉందని పర్యాటక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.







