ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ హక్కుల మంజూరు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఫ్రీహోల్డ్ హక్కుల కోసం వచ్చే దరఖాస్తుల పరిష్కారానికి నిర్దిష్ట కాలపరిమితులు విధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

అసైన్డ్ భూములు, చుక్కల భూములు, గ్రామాల్లోని ఇనాం భూములు, పట్టా భూములకు సంబంధించి ఫ్రీహోల్డ్ హక్కుల మంజూరు ప్రక్రియలో దరఖాస్తుల పరిష్కారానికి గడువులను ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఈ భూములపై ఫ్రీహోల్డ్ హక్కుల కోసం వచ్చే దరఖాస్తులను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

దరఖాస్తులు అందిన రోజునే ఆన్‌లైన్ విధానంలో సంబంధిత తహసీల్దార్‌కు పంపాలని ప్రభుత్వం సూచించింది. తహసీల్దార్‌లు ఆ దరఖాస్తులను 60 రోజుల్లోగా పరిష్కరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. లేదా తహసీల్దార్ నివేదిక అందిన వెంటనే, 60 రోజుల గడువు ముగిసేలోపు సదరు దరఖాస్తును ఆర్డీవో లాగిన్‌కు పంపాలని ఆదేశాలు జారీ చేసింది.

ఆర్డీవో లాగిన్‌కు దరఖాస్తు చేరిన తర్వాత, ఆ దరఖాస్తును 30 రోజుల్లోగా పరిష్కరించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ విధంగా మొత్తం ప్రక్రియకు స్పష్టమైన కాలపరిమితులను విధించడం ద్వారా ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

2023 నాటి భూ హక్కుల సవరణ చట్టం ప్రకారం, ఏదైనా భూమికి ఫ్రీహోల్డ్ హోదా కల్పించి, ఆ వివరాలను వెబ్ ల్యాండ్‌లో నమోదు చేసినట్లయితే, ఆ భూమికి రిజిస్ట్రేషన్‌ను అనుమతించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ శాఖలోని PDE మాడ్యూల్‌ను వినియోగించాలని సూచించింది.

ఫ్రీహోల్డ్ హోదా కల్పించిన భూమిని సెక్షన్ 22ఏ కింద నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు ప్రత్యేక ఉత్తర్వుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఫ్రీహోల్డ్ చర్యలు లేదా భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించిన ఉత్తర్వులను సంబంధిత వ్యక్తులు రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సిన అవసరం లేదని తెలిపింది.

వెబ్ ల్యాండ్‌లో ఉన్న భూమి స్థితిని ఆధారంగా చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వం సూచించింది. అయితే రిజిస్ట్రేషన్ అధికారులు, రిజిస్ట్రేషన్ సమయంలో వెబ్ ల్యాండ్ API ద్వారా పొందిన భూమి స్థితిని తమ రికార్డుల్లో భద్రపరచాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఈ ఉత్తర్వులకు అనుగుణంగా వెబ్ ల్యాండ్ వ్యవస్థలో అవసరమైన మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఫ్రీహోల్డ్ భూముల దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం తగ్గించడం, ఆన్‌లైన్ ప్రక్రియను వేగవంతం చేయడం, రిజిస్ట్రేషన్లలో ఎదురయ్యే సమస్యలను తొలగించడం ఈ ఉత్తర్వుల ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది.