అసైన్డ్, చుక్కల, ఇనాం, పట్టా భూములపై ఫ్రీహోల్డ్ దరఖాస్తుల పరిష్కారానికి కాలపరిమితులు నిర్ధేశిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 659ను విడుదల చేసింది. భూ హక్కుల స్పష్టత, రికార్డుల పారదర్శకత, దరఖాస్తుల వేగవంతమైన పరిష్కారం లక్ష్యంగా ఈ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి.

జీవో ప్రకారం ఫ్రీహోల్డ్ దరఖాస్తులపై వివిధ స్థాయిల్లో పరిష్కారానికి గడువులు ఖరారు చేశారు. ఆర్డీవో పరిధిలోకి వచ్చే దరఖాస్తులను 60 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. అలాగే నిర్దిష్ట కేటగిరీకి చెందిన దరఖాస్తులను 30 రోజుల్లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

తహసీల్దార్ స్థాయిలో పరిష్కరించాల్సిన ఫ్రీహోల్డ్ దరఖాస్తులకు కూడా 60 రోజుల గడువు నిర్ణయించారు. దరఖాస్తుల పరిశీలన, రికార్డుల పరిశోధన, ఫీల్డ్ స్థాయి ధృవీకరణ వంటి ప్రక్రియలను ఈ కాలపరిమితిలోనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఆన్‌లైన్ విధానంలో ఫ్రీహోల్డ్ దరఖాస్తు చేసిన రోజునే అది సంబంధిత తహసీల్దార్ లాగిన్‌కు చేరేలా సాంకేతిక మార్పులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దరఖాస్తు పంపిణీ, పెండింగ్ తగ్గింపు, ఆలస్యం నివారణ దిశగా ఈ చర్యలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.

వెబ్‌ల్యాండ్ వ్యవస్థలో ఫ్రీహోల్డ్ వివరాలు నమోదు అయిన వెంటనే సంబంధిత భూముల రిజిస్ట్రేషన్‌కు అవకాశం ఉంటుందని జీవోలో పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూములపై లావాదేవీలు, రిజిస్ట్రేషన్లు సులభతరం కానున్నాయి.

ఫ్రీహోల్డ్ ప్రక్రియ పూర్తయిన భూములను 22A జాబితా నుంచి తొలగించేందుకు ప్రత్యేక ఉత్తర్వులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఫ్రీహోల్డ్ ప్రొసీడింగ్స్‌ను రిజిస్ట్రేషన్ సమయంలో సమర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంది. వెబ్‌ల్యాండ్‌లో నమోదైన వివరాలే ప్రామాణిక రికార్డులుగా పరిగణించాలనే దిశగా ఈ మార్గదర్శకాలు జారీ చేశారు.

వెబ్‌ల్యాండ్ వ్యవస్థలో నమోదయ్యే ఫ్రీహోల్డ్ వివరాలను శాశ్వత రికార్డులుగా భద్రపరచాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రికార్డుల భద్రత, డేటా సమగ్రత, భవిష్యత్ వివాదాల నివారణ దృష్ట్యా ఈ చర్యలు కీలకమని అధికారులు పేర్కొంటున్నారు.

వెబ్‌ల్యాండ్‌లో అవసరమైన మార్పులు, సాంకేతిక సవరణలు చేయాలని Chief Commissioner of Land Administration (CCLA)కు ప్రభుత్వం ఆదేశించింది. ఫ్రీహోల్డ్ ప్రక్రియకు అనుగుణంగా వ్యవస్థను నవీకరించి, జిల్లా, మండల స్థాయి అధికారులకు తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది.