రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో నిత్యావసరమైన బియ్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు మించి విక్రయిస్తున్న వ్యాపారులపై విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టణంలోని పలు వ్యాపార కేంద్రాలు, గోదాములపై బుధవారం అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు.
అధికారుల రాక సమాచారం అందుకున్న కొందరు వ్యాపారులు తమ షాపులు, గోదాములకు తాళాలు వేసి అక్కడి నుంచి పరారైనట్లు స్థానికులు తెలిపారు. బియ్యం నిల్వలు, బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు తదితరాలను అధికారులు పరిశీలించినట్లు సమాచారం. ప్రభుత్వం నిర్ణయించిన ధరలను పట్టించుకోకుండా బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఫిర్యాదులపై ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
బియ్యం ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అక్రమ వ్యాపారులు మరింతగా దోపిడీకి ఉపయోగించుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి బియ్యాన్ని నిల్వ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధరలను అమలు చేయకుండా, సామాన్యులను నిలువుదోపిడీ చేస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తప్పనిసరిగా ఉండాలని ప్రజలు అభిప్రాయపడ్డారు. అలాగే తనిఖీల సమయంలో షాపులు, గోదాములకు తాళాలు వేసి పరారైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.
విజిలెన్స్ & ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు తమ తనిఖీల వివరాలను సంబంధిత ఉన్నతాధికారులకు నివేదించినట్లు సమాచారం. బియ్యం ధరల నియంత్రణ, అక్రమ నిల్వల నివారణ కోసం ఇలాంటి దాడులు కొనసాగించాలని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.






