రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ తీరానికి 23 కిలోమీటర్ల పరిధిలోకి ఇతర రాష్ట్రాలకు చెందిన చేపల వేట బోట్లు ప్రవేశించడం చట్టవిరుద్ధమని, రాష్ట్ర మత్స్యకారుల జీవనోపాధి, సముద్ర జీవవైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అక్రమంగా ప్రవేశించే బోట్లపై కఠిన చర్యలు కొనసాగుతాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు. అక్రమ చేపల వేటలో పాల్గొని స్వాధీనం చేసిన బోట్లను విడుదల చేసే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు.
శనివారం నాడు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ హాల్‌లో ఆంధ్రప్రదేశ్–తమిళనాడు అంతర్‌రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల, జిల్లా ఎస్పీ డా. అజిత వెజెండ్ల, జిల్లా అటవీశాఖ అధికారి షేక్ మహబూబ్ బాషా, మెరైన్ మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు డా. పి. సురేష్, జిల్లా మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి. లక్ష్మణరావు, ప్రకాశం జిల్లా సంయుక్త సంచాలకులు చి. శ్రీనివాసరావు, అసిస్టెంట్ డైరెక్టర్ చాంద్ బాషా, మెరైన్ పోలీసు అధికారులు పాల్గొన్నారు.
తమిళనాడు రాష్ట్రం నుంచి మత్స్యశాఖ, మత్స్యకారుల సంక్షేమ శాఖ డైరెక్టర్ డా. విజయకార్తికేయన్, చెన్నై జిల్లా కలెక్టర్ మాలతి హెలెన్, రాయపురం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పరమనాథం, స్టేట్ ఇంటెలిజెన్స్ వింగ్ డీఎస్పీ కరియప్పన్, అదనపు మత్స్యశాఖ డైరెక్టర్ నూర్‌జహాన్ బీవి, ప్రాంతీయ సంయుక్త సంచాలకులు ఎలంగో సమావేశానికి హాజరయ్యారు.
తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మత్స్యకారుల సమస్యలు, సముద్ర జలాల్లో అక్రమ ప్రవేశాల వల్ల కలుగుతున్న నష్టం తదితర అంశాలపై రెండు రాష్ట్రాల ప్రతినిధులు సుదీర్ఘంగా చర్చించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్, ఎస్పీ తమిళనాడు అధికారులకు పరిస్థితులను వివరించారు.
సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కలెక్టర్ హిమాన్షు శుక్ల, గత మూడు నెలలుగా జిల్లా సరిహద్దు తీర ప్రాంత సముద్ర జలాల్లో అక్రమంగా చేపల వేట సాగిస్తున్న తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన మత్స్యకారుల వల్ల ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులకు కలుగుతున్న నష్టాన్ని సమావేశంలో సవివరంగా వివరించినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మే నెల నుంచి ప్రత్యేక సముద్ర గస్తీ ప్రారంభించిన తర్వాత అక్రమ ప్రవేశాలపై కఠిన నిఘా కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
మత్స్యకారుల సమస్యలను నాలుగు విభాగాలుగా వర్గీకరించి తమిళనాడు ప్రతినిధులకు వివరించినట్లు కలెక్టర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బోట్లు, తమిళనాడుకు చెందిన బోట్లు, తమిళనాడు బోట్లలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులు, చిన్న అవుట్‌బోర్డ్, ఇన్‌బోర్డ్ ఇంజిన్ బోట్ల ద్వారా అక్రమంగా ప్రవేశించే వారి సమస్యలను విడివిడిగా చర్చించినట్లు చెప్పారు. ముఖ్యంగా నాలుగో కేటగిరీ వల్లే అధిక సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన వివరించారు.
ప్రస్తుతం అత్యధిక సమస్య పుదుచ్చేరి నుంచి వస్తోందని, అక్కడి నుంచి 640 హార్స్‌పవర్ సామర్థ్యం గల భారీ ట్రాలర్లు గుంపులుగా వచ్చి ఆంధ్రప్రదేశ్ జలాల్లో చేపల వేట నిర్వహిస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ బోట్లు రాష్ట్ర మత్స్యకారుల వలలను ధ్వంసం చేయడంతో పాటు సముద్ర జీవవైవిధ్యానికి కూడా తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అక్రమ చేపల వేటకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు, జీపీఎస్ టైమ్‌స్టాంప్‌లు, బోట్ల వివరాలు వంటి సాంకేతిక ఆధారాలను సమావేశంలో తమిళనాడు ప్రతినిధులకు ప్రదర్శించినట్లు కలెక్టర్ తెలిపారు. భారీ ట్రాలర్లు, నిషేధిత వలల వినియోగం వల్ల రక్షిత జాతికి చెందిన ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందుతున్న విషయాన్ని కూడా వివరించినట్లు చెప్పారు.
ఈ ఆధారాలను పరిశీలించిన తమిళనాడు ప్రతినిధులు సమస్య తీవ్రతను, ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల బాధను అర్థం చేసుకున్నారని, తమ రాష్ట్రానికి చేరుకున్న వెంటనే చెన్నైలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి మత్స్యకారులకు అవగాహన కల్పించి, ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి ప్రవేశించకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు.
మన తీరం పరిధిలోని సముద్ర జలాల్లోకి అక్రమంగా ప్రవేశించిన తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన సీజ్ చేసిన ఏడు బోట్లను విడుదల చేయాలని తమిళనాడు ప్రతినిధులు విజ్ఞప్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. అయితే ప్రస్తుతానికి ఏ బోటును విడుదల చేసే ప్రసక్తే లేదని, తమిళనాడు అధికారులు తీసుకునే చర్యలను పరిశీలించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే బోట్ల విడుదలపై నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ప్రతి చేపల వేట బోటులో ట్రాన్స్‌పాండర్‌ను తప్పనిసరిగా అమర్చాలని, అది ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండాలని సమావేశంలో సూచించినట్లు కలెక్టర్ తెలిపారు. 23 కిలోమీటర్ల పరిధిలోకి ప్రవేశించే సమయంలో ట్రాన్స్‌పాండర్ ద్వారా హెచ్చరిక సందేశాలు అందే విధంగా వ్యవస్థ పనిచేస్తోందని వివరించారు.
జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో సముద్ర గస్తీ నిరంతరం కొనసాగుతోందని, భవిష్యత్తులో కూడా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ జలాల్లోకి ప్రవేశించే ఏ బోటునైనా స్వాధీనం చేసుకుని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ కు తరలిస్తామని కలెక్టర్ తెలిపారు. సంబంధిత రాష్ట్రాలు తమ మత్స్యకారులు నిబంధనలు పాటించేలా ఆచరణాత్మక చర్యలు తీసుకునే వరకు సీజ్ చేసిన బోట్లను విడుదల చేసే ప్రసక్తే లేదని ఆయన తేల్చిచెప్పారు.
సమావేశానికి పుదుచ్చేరి అధికారులు హాజరు కాకపోవడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశ నిర్ణయాలను తమిళనాడు ప్రభుత్వంతో పాటు పుదుచ్చేరి ప్రభుత్వానికి కూడా అన్ని ఆధారాలతో పంపాలని నిర్ణయించారు. రాష్ట్రంలోని మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విజయకుమార్, మత్స్యశాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.







