రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: వానాకాలం వ్యవసాయానికి శ్రీకారం చుట్టే మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వానాకాలం ఆరంభంతో రాష్ట్రాల్లో వ్యవసాయ కార్యకలాపాలు ముమ్మరంగా ప్రారంభం కానున్న నేపథ్యంలో రైతాంగం సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. వ్యవసాయం పండుగగా, తొలకరి వానలు రైతులు, రైతు కూలీల ఇళ్లలో ఆనందోత్సాహాలు నింపాలని ఇద్దరు ముఖ్యమంత్రులు ఆకాంక్షించారు. వానాకాలం తొలి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని వారు అభిలషించారు.
వాతావరణ శాఖ, రాష్ట్ర వ్యవసాయ శాఖ సూచనలను పరిగణలోకి తీసుకుని రైతులు పంటల సాగుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితుల్లో వేగంగా వస్తున్న మార్పులు, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలపై వాతావరణ శాఖ ముందస్తు అంచనాలను దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్ సాగుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
కొన్ని పరిమితమైన పంటల సాగుపైనే ఎక్కువగా దృష్టి సారించడం వల్ల పప్పుధాన్యాలు, వేరుశనగ, పెసలు, మినుములు, నువ్వులు వంటి పంటలను దిగుమతి చేసుకోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. దేశీయ అవసరాలను దృష్టిలో పెట్టుకుని పంటల వైవిధ్యంపై రైతులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించారు.
వరుసగా ఒకే పంటను సాగు చేయడం వల్ల నేల సారం తగ్గిపోవడంతో పాటు తెగుళ్ల సమస్యలు పెరుగుతున్నాయని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యవసాయ శాఖ సూచనలకు అనుగుణంగా పంట మార్పిడి చేపట్టడం ద్వారా నేల సారం పెరగడమే కాకుండా దీర్ఘకాలంలో అధిక దిగుబడులు అందించే పంటల వైపు రైతులు మొగ్గుచూపాలని సూచించారు.
మృగశిర కార్తె ఈసారి అన్నదాతలకు శుభారంభం కావాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పుష్కలమైన పంటలు పండాలని ముఖ్యమంత్రులు ఆకాంక్షించారు. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రైతాంగం అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు అవసరమైన సహకారం అందిస్తాయని అధికార వర్గాలు తెలియజేశాయి.







