రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
రాజకీయాల్లోకి అమ్మాయిలు రావాల్సిన అవసరం ఉంది: పీవీయన్ మాధవ్
విజయవాడ : రాష్ట్ర రాజకీయాల్లో అమ్మాయిలు, యువత మరింత చురుకుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పీవీయన్ మాధవ్ అన్నారు. 25 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలు తప్పకుండా రాజకీయాల్లోకి వచ్చి రాణించాలని ఆయన ఆకాంక్షించారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ కుమార్ రెడ్డి అధ్యక్షతన బీజేవైఎం పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ ఏపీ అధ్యక్షులు పీవీయన్ మాధవ్ ముఖ్య అతిథిగా హాజరై యువత పాత్ర, రాష్ట్ర అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై మాట్లాడారు.
యువత ప్రతీ ఏడాది క్యాలెండర్‌ను పెట్టుకుని వాటిని అమలు చేసే విధానాన్ని అలవరుచుకోవాలి. ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళమెత్తాలి. అదే సమయంలో విపక్షాలు చేసే కుట్రపూరిత దుష్ప్రచారాలను తిప్పికొట్టాలి.
కేంద్రం వంద శాతం నిధులు ఇచ్చిన ఏకైక ప్రాజెక్టు పోలవరం. త్వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యమైన తీరును ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి. 14 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు నేడు ఏపీకి వచ్చాయి.
అనేక ప్రాజెక్టులు పెట్టేందుకు ఏపీకి చాలా మంది పారిశ్రామిక వేత్తలు వస్తున్నారు. విశాఖలో డేటా సెంటర్‌తో పాటు అనేక భారీ పరిశ్రమలు నెలకొల్పుతున్నారు. మోదీ ఆలోచనలు, ఆకాంక్షలు, అభివృద్ధి అంశాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లాలి.
ప్రపంచంలో భారతదేశం ప్రత్యేకంగా తన స్థానాన్ని నిలబెట్టుకున్న తీరు, మోదీ పని విధానం గురించి అందరూ తెలుసుకోవాలి. సోషల్ మీడియా ద్వారా బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, మోదీ అమలు చేసే సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలి.
కీటకాలతో పార్టీ పెట్టుకున్న వారి వెనుక ఎవరున్నారనేది బహిర్గతం అయింది. దేశాన్ని అభివృద్ధి బాటలో నడిచేలా యువత మంచి లక్ష్యంతో పని చేయాలి.
యువత రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేసేలా బీజేపీ తన వంతు కృషి చేస్తుందని పీవీయన్ మాధవ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యంలో యువత, ముఖ్యంగా అమ్మాయిలు నాయకత్వ బాధ్యతలు స్వీకరించి దేశ అభివృద్ధి ప్రయాణంలో ముందుండాలని ఆయన అభిప్రాయపడ్డారు.







