రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు ఆలయ గర్భగుడిలో పూజలు చేయరాదని దేవాదాయశాఖ, శృంగేరి శారదాపీఠం జారీ చేసిన మార్గదర్శకాల అమలుపై హైకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మార్గదర్శకాల అమలుకు సంబంధించి ఈ ఏడాది మార్చి 30న హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం పక్కన పెట్టింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ ఎన్. జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ విషయంలో విచారణ జరిపింది. దేవాదాయశాఖ అధికారులు విచారణ సమయంలో అన్ని సంబంధిత అంశాలను సింగిల్ జడ్జి దృష్టికి తీసుకురాలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. కోర్టుకు పూర్తి సమాచారం ఇవ్వకుండా ఉత్తర్వులు పొందినందున ఆ ఉత్తర్వులు చెల్లుబాటు కావని స్పష్టం చేసింది.
దీంతో ఈ అంశాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకే పంపిస్తూ, మరోసారి అన్ని వివరాలను సమగ్రంగా పరిశీలించి విచారణ జరపాలని ధర్మాసనం ఆదేశించింది. 2010 నవంబర్ 10న దేవాదాయశాఖ కీలక సర్క్యులర్ జారీ చేసింది. విదేశాలకు వెళ్లి వచ్చిన అర్చకులు గర్భాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడానికి అనుమతి ఉండదని ఆ సర్క్యులర్‌లో పేర్కొంది.
శృంగేరి శారదా పీఠాధిపతులు జారీ చేసిన ప్రామాణిక ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని దేవాదాయశాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ, విజయవాడ దుర్గమ్మ ఆలయంలో శ్రీ చక్ర నవావరణ అర్చన పారాయణదారు సుబ్రహ్మణ్య సోమయాజి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సింగిల్ జడ్జి విచారణ జరిపి, దేవాదాయశాఖ జారీ చేసిన సర్క్యులర్‌తో పాటు శృంగేరి శారదా పీఠం ప్రామాణికాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
సింగిల్ జడ్జి ఇచ్చిన ఈ తీర్పును సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు హైకోర్టు ధర్మాసనం ముందు సవాల్ చేశారు. 2001–2006 మధ్య తాను విదేశాలకు వెళ్లిన విషయాన్ని, ఆ ప్రయాణానికి దేవాదాయశాఖ కమిషనర్ అనుమతి తీసుకున్న విషయాన్ని ఆయన తరఫు లాయర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇవన్నీ దేవాదాయశాఖ సర్క్యులర్ అమల్లోకి రాకముందే జరిగాయని, విదేశాల్లో ఉన్న సమయంలో శ్రీనివాసాచార్యులు జీతం కూడా తీసుకోలేదని కోర్టుకు వివరించారు.
కాబట్టి ఆ సర్క్యులర్ శ్రీనివాసాచార్యులకు వర్తించదని, దేవాదాయశాఖ ఇచ్చిన సర్క్యులర్‌ను చట్టవిరుద్ధమని ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ పెండింగ్‌లో ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. దేవాదాయశాఖ అధికారులు ఈ కీలక అంశాలను సింగిల్ జడ్జి దృష్టికి తీసుకెళ్లలేదని లాయర్ వాదించారు. సింగిల్ జడ్జి తీర్పు శ్రీనివాసాచార్యులపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున, తాము అప్పీల్ చేసుకునేందుకు అనుమతించాలని కోరారు.
ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ధర్మాసనం, సింగిల్ జడ్జి దృష్టికి కీలక అంశాలు వెళ్లలేదన్న విషయం స్పష్టమైందని పేర్కొంది. అందువల్ల ఈ ఏడాది మార్చి 30న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు చెల్లుబాటు కాదని తేల్చి, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని మరోసారి పునర్విచారణ జరపాలని ఆ అంశాన్ని తిరిగి సింగిల్ జడ్జి వద్దకు పంపింది.







