మంగళగిరి: విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ కృషితో మంగళగిరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గంలో మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది. నిడమర్రు రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద నిర్మించనున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులకు బుధవారం శంకుస్థాపన జరిగింది.

మంత్రి నారా లోకేశ్‌, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ కలిసి నిడమర్రు రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమానికి ముందుగా మంగళగిరి–నిడమర్రు రహదారి వద్దకు చేరుకున్న మంత్రి లోకేశ్‌, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్‌లకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు ఘన స్వాగతం పలికారు.

మంగళగిరి నుంచి రాజధాని అమరావతి, తాడికొండ నియోజకవర్గానికి అనుసంధానంగా ఉన్న నిడమర్రు రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ వద్ద ఆర్వోబీ నిర్మాణం చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టును రూ.142 కోట్ల వ్యయంతో నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. దశాబ్దాలుగా ఈ మార్గంలో రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ కారణంగా వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. గేటు మూసివేతల వల్ల ప్రయాణికులు, రైతులు, వ్యాపార వర్గాలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో సమస్యకు శాశ్వత పరిష్కారంగా రైల్వే ఓవర్ బ్రిడ్జి మంజూరుకు మంత్రి నారా లోకేశ్‌ చొరవ తీసుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

ఆర్వోబీ నిర్మాణం పూర్తయ్యాక నిడమర్రు, మంగళగిరి, తాడికొండ, అమరావతి ప్రాంతాల మధ్య రాకపోకలు సులభతరం కానున్నాయి. మంగళగిరి పట్టణం నుంచి మంగళగిరి నియోజకవర్గంలోని బేతపూడి, నిడమర్రు, కురగల్లు, నీరుకొండ గ్రామాల ప్రజలకు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అత్యవసర సేవలు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా, విద్య, వైద్య సేవలకు చేరుకునే సమయం కూడా తగ్గుతుందని స్థానికులు భావిస్తున్నారు.

నిడమర్రు రైల్వే లెవల్‌ క్రాసింగ్‌పై ప్రతిపాదించిన ఆర్వోబీని రైల్వే లైన్‌పై 10 మీటర్ల ఎత్తులో నిర్మించనున్నారు. వంతెన మొత్తం పొడవు 767.50 మీటర్లు. వంతెనపై నాలుగు లైన్ల రహదారిని ఏర్పాటు చేయాలని ప్రణాళిక. సర్వీస్‌ రోడ్లతో కలిపి ఆర్వోబీ మొత్తం వెడల్పు 28 మీటర్లు ఉండేలా రూపకల్పన చేశారు. దీంతో భారీ వాహనాలతో పాటు చిన్న వాహనాల రాకపోకలు కూడా సాఫీగా సాగనున్నాయి.

శంకుస్థాపన కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.