విజయవాడ: ఈ నెల 15వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.5 కోట్ల సీడ్‌ బాల్స్‌ తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ప్రతి సీడ్‌ బాల్‌ ఒక చెట్టును సృష్టించగలిగే శక్తి కలిగి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఎన్టీఆర్‌ జిల్లా మూలపాడు బటర్‌ఫ్లై పార్క్‌లో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో కలిసి సీడ్‌ బాల్స్‌ తయారు చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సీడ్‌ బాల్స్‌ కార్యక్రమంపై ఆయన వివరాలు వెల్లడించారు.

ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని కాపాడుతుంది. సీడ్‌ బాల్స్‌ను అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాల్లో వెదజల్లే ఏర్పాటు చేస్తున్నాం. మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్‌ సాయంతో సీడ్‌ బాల్స్‌ను జల్లుతాం. మొక్కల సంరక్షణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలి. నాటడమే కాదు.. వాటిని సంరక్షించడం కూడా కీలకమే. సీడ్‌ బాల్స్‌ను అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీర ప్రాంతాల్లో విస్తృతంగా చల్లేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కార్యక్రమంలో అధికార వర్గాలు తెలియజేశాయి. మనుషులు సులభంగా చేరలేని ప్రాంతాల్లో డ్రోన్‌ సాంకేతికతను వినియోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. చెట్లు నాటడం, వాటిని సంరక్షించడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావించి ముందుకు రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.