ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో ఆస్తులు కొనుగోలు చేసే వారికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఆస్తి రిజిస్ట్రేషన్ అనంతరం మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగి మ్యుటేషన్ కోసం విడిగా దరఖాస్తు పెట్టాల్సిన అవసరం లేకుండా మార్పులు చేసింది. ఈ మేరకు చట్ట సవరణలకు ఏపీ శాసన సభ ఆమోదం తెలిపింది.

ఇప్పటి వరకు మున్సిపాల్టీ, కార్పొరేషన్ పరిధిలో ఆస్తి కొనుగోలు చేసిన తర్వాత, రిజిస్ట్రేషన్ పూర్తయిన అనంతరం యజమాని పేరు మున్సిపాల్టీ రికార్డుల్లో మార్పు చేయించుకోవాలంటే ప్రత్యేకంగా మ్యుటేషన్ దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. ఈ ప్రక్రియలో ప్రజలు మున్సిపల్ కార్యాలయాలకు పలుమార్లు వెళ్లి, అవసరమైన పత్రాలు సమర్పించి, మ్యుటేషన్ ఫీజు చెల్లించి, ఆస్తి రికార్డుల్లో పేరు మార్పు పూర్తి చేయించుకోవాల్సి ఉండేది.

ఇకపై ఈ ప్రక్రియను సులభతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆస్తి రిజిస్ట్రేషన్ జరిగే సమయంలోనే మున్సిపల్ రికార్డుల్లో కూడా యజమాని పేరు మారేలా వ్యవస్థలను ఇంటిగ్రేట్ చేసింది. అంటే రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనే అవసరమైన సమాచారం మున్సిపల్, కార్పొరేషన్ వ్యవస్థలకు చేరేలా సాంకేతిక సమన్వయం చేపట్టింది.

ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ ఫీజు చెల్లించేలా శాసన సవరణలు చేశారు. ఇప్పటి వరకు మున్సిపాల్టీ వద్ద విడిగా మ్యుటేషన్ ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఇకపై ఆస్తి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్‌కు సంబంధించిన ఫీజు వసూలు చేసే విధంగా చట్టంలో మార్పులు చేశారు.

అలాగే కార్పొరేషన్‌లు, వివిధ గ్రేడ్‌ల వారీగా ఉన్న మున్సిపాల్టీల్లో మ్యుటేషన్‌కు ఏకీకృత ఫీజులు అమలు చేసేలా చట్టంలో సవరణలు చేశారు. ఇప్పటి వరకు ప్రాంతానికో, స్థానిక సంస్థకో వేర్వేరు విధానాలు, ఫీజు నిర్మాణం ఉండగా, ఇప్పుడు వాటిని సమగ్రంగా పునర్వ్యవస్థీకరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది.

ఈ మార్పులతో మున్సిపల్, కార్పొరేషన్ పరిధిలో ఆస్తులు కొనుగోలు చేసే వారికి పరిపాలనా భారాన్ని తగ్గించడంతో పాటు, ఆస్తి రికార్డుల్లో యజమాని పేరు మార్పు ప్రక్రియ వేగవంతం కానుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. చట్ట సవరణలకు ఏపీ శాసన సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో, సంబంధిత శాఖలు అమలు విధానంపై తదుపరి చర్యలు ప్రారంభించనున్నాయి.