‘ఐదో తేదీకల్లా రాకపోతే పోలీసుల్ని కలువు’… వివాహిత హత్య కేసులో సెల్ఫీ వీడియో సంచలనం

టెక్కలి మండలం లింగాలవలస పంచాయతీ సొర్లిగాం గ్రామానికి చెందిన వివాహిత దుంపల హరిణి (24) హత్య కేసు జిల్లాలో కలకలం రేపుతోంది. మొదట గుండెపోటు, ఆత్మహత్యగా ప్రచారం చేసిన కుటుంబసభ్యుల నిజ స్వరూపం దర్యాప్తులో బయటపడింది. హరిణి హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వెళ్లే ముందు తీసిన సెల్ఫీ వీడియో, ఆమె స్నేహితుడు సుధా నాగేంద్ర చేసిన ఫిర్యాదు ఈ కేసు బట్టబయలుకు కారణమయ్యాయి.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం… సొర్లిగాం గ్రామానికి చెందిన హరిణికి డిగ్రీ చదువుతున్న సమయంలోనే 2010లో మేనమామ దంతేశ్వరరావుతో వివాహం జరిగింది. ఆయన ప్రస్తుతం సారవకోట మండలంలో సచివాలయంలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. దంపతులకు గుణజ్ఞ అనే నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత హరిణి డిగ్రీ పూర్తి చేసి, గ్రూప్స్‌ పరీక్షలకు సిద్ధం కావడానికి తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌ వెళ్లింది.

చదువుపై దృష్టి పెట్టలేకపోవడంతో కుమారుడిని తల్లి విజయకుమారి వద్ద ఉంచి, హైదరాబాద్‌లోని ఎస్‌ఆర్‌నగర్‌లో ఓ హాస్టల్‌లో చేరింది. అక్కడ స్టడీ సెంటర్‌లో ఆమెకు అదే ప్రాంతానికి చెందిన సుధా నాగేంద్రతో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన హరిణి తల్లి నిలదీయడంతో, ఇంట్లో గొడవలు చెలరేగాయి. అనంతరం బాలానగర్‌ పోలీసు స్టేషన్‌లో ఈ ఏడాది ఫిబ్రవరిలో హరిణి ఫిర్యాదు చేసింది. నాగేంద్రను పెళ్లి చేసుకుంటానని, భర్త దంతేశ్వరరావు నుంచి విడాకులు కావాలని కోరినట్లు పోలీసులు తెలిపారు.

ఈ నేపథ్యంలో మే 31న హరిణిని భర్తతో విడాకులు ఇప్పిస్తామని చెప్పి సొర్లిగాం గ్రామానికి తీసుకువచ్చారు. భర్తను కేసు నుంచి తప్పించాలనే ఉద్దేశంతో సినిమాకు పంపారు. ఇంట్లో మంచంపై నిద్రిస్తున్న హరిణి కాళ్లను తల్లి విజయకుమారి గట్టిగా పట్టుకోగా, తాతయ్య దుంపల బలుసా ఇనుప రాడ్‌తో తలపై బలంగా మోదాడు. కేకలు వేయకుండా నోరు నొక్కి చంపినట్లు దర్యాప్తులో బయటపడింది.

తర్వాత హరిణి మృతి చెందిన విషయాన్ని భర్తకు ఫోన్‌లో తెలియజేశారు. గ్రామస్థులకు తొలుత గుండెపోటుతో చనిపోయిందని, తర్వాత ఆత్మహత్యకు ప్రయత్నించిందని నమ్మించే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి మృతదేహాన్ని శ్మశానవాటికలో దహనం చేసి ఆధారాలు చెరిపేశారు. వీఆర్వో రమేష్‌ ఫిర్యాదు మేరకు ఈ నెల 8న టెక్కలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దర్యాప్తు సందర్భంగా హరిణి తల్లి విజయకుమారి, తాతయ్య బలుసా, భర్త దంతేశ్వరరావును అరెస్టు చేసి బుధవారం రిమాండుకు పంపించారు. హత్యకు వినియోగించిన ఇనుప రాడ్‌తో పాటు నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ డి. లక్ష్మణరావు తెలిపారు.

హరిణి హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వెళ్లే ముందు కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తూ ఓ సెల్ఫీ వీడియోను సుధా నాగేంద్రకు పంపినట్లు పోలీసులు వెల్లడించారు. అందులో ఐదో తేదీకి తాను తిరిగి రాకపోతే పోలీసులను ఆశ్రయించాలని చెప్పినట్లు దర్యాప్తులో తెలిసింది. నిర్ణీత తేదీకి హరిణి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన నాగేంద్ర ‘శక్తి టీం’ను సంప్రదించాడు. అక్కడి నుంచి జిల్లా పోలీసులకు సమాచారం చేరడంతో విచారణ ముమ్మరమై, హత్యకు సంబంధించిన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.